రాజకీయాల్లో భయ పెట్టి అందర్నీ తమ వెనుక నడిపించుకోవడం కన్నా…సానుభూతి అనేది ఎక్కువ బలమైనది. ప్రజల సానుభూతి పొందితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ఈ రెండు అస్త్రాలను చాలా కాలంగా ప్రయోగిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలో వచ్చిన చీలకి కారణంగా భయ పెట్టే అస్త్రం వైఎస్ జగన్ వైపు.. సానుభూతి అస్త్రం వైఎస్ సునీత వైపు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సనీత పోరాటంపై కడప జిల్లా వాసుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీపై అభిమానం కంటే భయమే ఎక్కువ. రౌడీ మూకను పెంచి పోషించి ఎవరైనా ఎదురు తిరిగితే ఇళ్ల మీదకు పంపుతారన్న ఉద్దేశంతో .. చాలా మంది సపోర్టుగా ఉంటూంటారు. అదే సమయంలో వైఎస్ ఫ్యామిలీ అంతా ఏకతాటిపై ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కుటుంబం చీలికలు పేలికలు అవుతోంది. ఇలాంటి సమయంలో జరిగిన వివేకానందరెడ్డి హత్య సంచలనం అవుతోంది. ఆ హత్యను కుటుంబంలోని వారే చేసినట్లుగా స్పష్టం కావడం.. వారికి శిక్ష పడేలా సునీత నిరంతరం పోరాటం చేస్తూండటం .. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
అందరి మీద సునీత పోరాడుతున్న వైనం.. ఆమె ధైర్య సాసహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. వైఎస్ కుటుంబానికి అసరైన వారసురాలు సునీతేనన్న అభిప్రాయం రచ్చబండల వద్ద జరుగుతున్న చర్చల్లో వస్తోంది. అయితే సునీత ఇంత వరకూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా కూడా చెప్పలేదు. కానీ తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం.. ఆ హత్యను తన మీద వేయడానికి కూడా చేసిన ప్రయత్నాలతో ఇక కుటుంబసభ్యులు అని ఉపేక్షించడం దండగని ఆమె అనుకుంటున్నారు. అందుకే ఎంతైనా తెగించి పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆమె రాజకీయ పోరాటం చేస్తే.. ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయన్న ప్రచారం మాత్రం ఊపందుకుంటోంది.