వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల కీలక మలుపులు తిరుగుతోంది. సీబీఐ దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని సీరయస్గా దర్యాప్తు చేయడం లేదని.. దర్యాప్తు అధికారులపైనే నిందితులు కేసులు పెడుతున్నారని ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మానసం పర్యవేక్షించాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. రెండేళ్లుగా సీబీఐ విచారణ కొనసాగిస్తూనే ఉంది.
వివేకా హత్య ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అయితే వివేకా హత్య కేసులో సూత్రదారులు ఎవరు అనేది తేల్చి అరెస్టు చేయడంలో సీబీఐ పురోగతి సాధించలేదు. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడేళ్లు దాటింది. గత ప్రభుత్వ హయాంలో సిట్ దర్యాప్తు, ఆ తరువాత వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత మరో సిట్ దర్యాప్తు చేసినా అసలైన దోషులను పట్టుకోలేకపోయారు.
అప్పట్లో సీబీఐ విచారణ కావాలన్న జగన్. .. తర్వాత వద్దన్నారు. హైకోర్టు సీబీఐకి కేసు అప్పగిస్తే.. సీబీఐపైనే ఒత్తిడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో వైపు ఈ కేసులో సూత్రధారులెవరో స్పష్టంగా తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ వివేకా కుమార్తె మరింత గట్టిగా న్యాయం కోసం పోరాడుతున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ త్వరలో జరగనుంది.