ఫైనల్ లో చోటు కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు కీలక సంగ్రామానికి రెడీ అయ్యాయి. క్వాలిఫయర్ -2లో రాజస్థాన్ ను మట్టి కరిపించి ఫైనల్ కు వెళ్లాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తుండగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరును ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోన్న రాజస్థాన్ ఈ మ్యాచ్ లోనూ అదే తరహ ప్రదర్శన చేయాలనుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలుపుపై ఇరు జట్లు కన్నేశాయి.
చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాట్స్ మెన్స్ కు , రాజస్థాన్ స్పిన్నర్లకు మధ్య ఆసక్తికర పోరు నడిచే అవకాశం ఉంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో ఈ మ్యాచ్ లో అశ్విన్, చాహల్ పై రాజస్థాన్ గంపెడు ఆశలు పెట్టుకోగా… ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై నమ్మకం ఉంచింది హైదరాబాద్. అయితే , మొదటి క్వాలిఫయర్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో నిరాశపరిచిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని టీం మేనేజ్ మెంట్ ఆశిస్తోంది. అయితే, హైదరాబాద్ జట్టు టపార్డర్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. వారు మంచి స్కోర్ ను అందిస్తేనే దానిని భారీ స్కోర్ గా మలుస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్ కే అవుట్ అయిన మ్యాచ్ లలో సన్ రైజర్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ మ్యాచ్ లోనూ బ్యాట్స్ మెన్స్ అంతా తలో చేయి వేయాలని మేనేజ్ మెంట్ ఆశిస్తోంది.
మరోవైపు…గత మ్యాచ్ లో బెంగళూరును ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఇంటికి పంపిన రాజస్థాన్ కీలకమైన ఈ మ్యాచ్ లోనూ అదే తరహ ప్రదర్శన చేయాలనుకుంటుంది.ఆ జట్టులో ఓపెనర్లు, మిడిలార్డర్ బలంగా ఉండటంతోపాటు బౌలర్లు , స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోన్న రాజస్థాన్ ను హైదరాబాద్ ఓడించాలంటే ఆల్ రౌండర్ ప్రదర్శన చేయాల్సిందే. చూడాలి మరి ఫైనల్ లో కేకేఆర్ తో ఎవరు తలపడుతారో..