ఉచిత టిక్కెట్ల కోసం వేధింపులు మానకపోతే తాము వేరే గ్రౌండ్ చూసుకుంటామని హెచ్చరించిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యాజమాన్యం దెబ్బకు .. హెచ్సీఏ పెద్దలు దిగి వచ్చారు. ఇక ముందు ఒప్పందానికి వ్యతిరేకంగా ఎలాంటి చిన్న పనిచేయాలని అడగబోమని రాసిచ్చారు. కొద్ది రోజుల నుంచి ఎస్ఆర్హెచ్ – హెచ్సీఏ మధ్య వివాదం ముదురుతోంది. స్వయంగా సీఎం కూడా జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పదవికే ఎసరు వస్తుందని అనుకున్నారేమో కానీ.. ఇక SRH జోలికి రాబోమని చర్చలు పెట్టి మరీ హామీ ఇచ్చేశారు.
బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పని చేసేందుకు ఇరు వర్గాలు అంగీకారం తెలుపుతూ ఓ నిర్ణయం తీసుకున్నారు. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంటరీ పాసుల కేటాయిస్తారు. అంతే తప్ప.. ఇక హెచ్సీఏ అధ్యక్షుడు బ్లాక్ మెయిల్ చేశారని వేరే బాక్సులు.. ఇతర టిక్కెట్లు ఇచ్చే చాన్స్ లేదని ఎస్ఆర్హెచ్ స్పష్టం చేసింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్హెచ్కు పూర్తిగా సహకరిస్తామని హెచ్సీఏ హామీ ఇచ్చింది.
చర్చలు పూర్తయిన తరవాత వివాదాలన్ని ముగిశాయని హెచ్సీఏ-ఎస్ఆర్హెచ్ సంయుుక్తంగా ప్రకటించాయి. వివాదం ఇంకా ముదిరితే మొదటికే మోసం వస్తుందని. .. హెచ్సీఏ పెద్దల జాతకాలు బయటపడటంతో పాటు .. హైదరాబాద్కు ఐపీఎల్ టీం కూడా లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమయింది.దీంతో ఈ వివాదన్ని ఇంతటితో ముగించడం మంచిదని.. హెచ్సిఏ కాళ్ల బేరానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.