2021లో హిట్స్ వున్నాయి. చిన్న సినిమాలు గా వచ్చి పెద్ద విజయాల్ని అందుకున్న చిత్రాలున్నాయి. అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు వున్నాయి. నిర్మాతకు లాభాలు తెచ్చినపెట్టిన చిత్రాలున్నాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
ఉప్పెన : చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది ఉప్పెన. మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన సినిమా ఇది. హీరో, హీరోయిన్, దర్శకుడు నూతన పరిచయం. విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టికి యూత్ కనెక్ట్ అయిపోయారు. కొత్త దర్శకుడు బుచ్చిబాబు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. మైత్రీ మూవీస్ కి ఈ ఏడాది లాభాలు తెచ్చిన పెట్టిన సినిమాగా కూడా నిలిచింది ఉప్పెన.
జాతి రత్నాలు: లాజిక్కులని వదిలేసి మ్యాజిక్కు చేసిన సినిమా జాతిరత్నాలు. జబర్దస్త్ జోకులన్నీ ఒక చోట చేర్చి సినిమా తీశారనే విమర్శని ఎదురుకున్నా.. సినిమా మాత్రం జబర్దస్త్ హిట్ అయ్యింది. నవ్వించడమే లక్ష్యంగా సాగిన జాతిరత్నాలు కామెడీ రత్నాలు అనిపించింది. నవీన్ పోలిశెట్టి టైమింగ్ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. ప్రేక్షకులు ఈ సినిమాకి ఎంతలా కనెక్ట్ అయ్యారంటే జాతి రత్నాలు పార్ట్ 2ని ఎంజాయ్ చేయడానికి రెడీగా వున్నారు. అన్నట్టు .. లాభాల్లో కూడా ఈ సినిమా రత్నమే.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా : యాంకర్ ప్రదీప్ హీరోగా అవతారం ఎత్తిన సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. నిజానికి ఈ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ ‘నీలి నీలి ఆకాశం’ పాట ఈ సినిమాని కోట్ల రూపాయిల పబ్లీసిటీ తెచ్చిపెట్టింది. సినిమా థియేటర్ లోకి కూడా వచ్చింది. టాక్ ని పక్కన పెడితే.. నిర్మాతలు లాభపడ్డారు. తర్వాత అమోజన్ మంచి రేటు ఇచ్చి కొనుక్కుంది.
నాంది : అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత హిట్ అనే మాట విన్నాడు. వరుస అపజయాలతో వెనకబడ్డ నరేష్ కి ఏడాది విజయానికి ‘నాంది’ పడింది. విమర్శకులని కూడా ఈ సినిమా మెప్పించింది. నరేష్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘నాంది’ నరేష్ కెరీర్ లోనే ఒక మంచి చిత్రంగా నిలిచింది.
పెళ్లి సందడి : కె. రాఘవేంద్రరావు పెళ్లి సందడి క్లాసిక్. అయితే అదే టైటిల్ తో ఆయన నటుడిగా మారారు. రోషన్ హీరో వచ్చిన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కీరవాణి మ్యూజిక్ బాగా కలిసోచ్చాయి. నిర్మాతకి రూపాయి మిగిలింది.
సినిమా బండి: ఓటీటీ కంటెంట్ ఇవ్వడంలో రాజ్ డీకే ఆరితేరిపోయారు. ఫ్యామిలీ మ్యాన్ తో సంచలనం సృష్టించారు. వారి నిర్మాణంలో వచ్చింది ‘సినిమా బండి’. చిన్న కథ తో ఒకే వూర్లో కధనం నడిపి సూపర్ అనిపించారు. నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది,
ఎక్ మినీ కథ : టైటిల్ కి తగ్గట్టు చిన్న సినిమా ఇది. కొత్త దర్శకుడు కార్తిక్ రాపోలు తీసిన ఈ అడల్ట్ కామెడీ నేరుగా అమోజన్ లో విడుదలైయింది. వ్యూస్ పరంగా రికార్డ్ సృష్టించింది. యూత్ ఆడియన్స్ కి సినిమా తెగ నచ్చేసింది. అమోజన్ ఇచ్చిన రేటు కూడా నిర్మాతలకు బాగా కిట్టుబాటు అయ్యింది,
వరుడు కావలెను : సితార బ్యానర్ నుంచి మరో డీసెంట్ మూవీగా నిలిచింది వరుడు కావలెను. మహిళా దర్శకురాలు లక్షీ సౌజన్య చేసిన మొదటి ప్రయత్నం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ రీతూ వర్మకి మంచి మార్కులు పడ్డాయి. ఓపెనింగ్స్ కూడా బావున్నాయి. మంచి రేటు చెల్లించి జీ5 ఓ టీటీకి తీసుకుంది. లక్ష్యతో పోల్చుకుంటే వరుడు కావలెను శౌర్యకి మంచి ఫలితాన్ని ఇచ్చింది.