సినిమాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని అంచనాలు ఉంటాయి. వెబ్ మూవీకి అవేం ఉండవు. కాన్సెప్టు బాగుందా… పనైపోయినట్టే. కొత్త తరహా ప్రయత్నాలకు.. ఓటీటీ ఓ మార్గం వేసేసింది. నిడివి ఇంత ఉండాలి.. సినిమాకి సరిపడా.. సూత్రాలుండాలి.. అనే నిబంధనలేవీ ఉండవు. ఆలోచన బాగుంటే, ప్రయత్నం సక్సెస్ అయినట్టే. ఓటీటీలు ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో… మంచి ఆలోచనలు తప్పకుండా వర్కవుట్ అవుతాయి. అవుతున్నాయి. `సూపర్ ఓవర్` కూడా అలాంటి ఓ వినూత్నమైన ఆలోచనే. ఆహాలో.. స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ మూవీ ఇది. మరి.. ఇది ఎలా వుంది? టైటిల్ కి తగ్గట్టు సూపర్ గా వుందా? అసలు సూపర్ ఓవర్ కాన్సెప్ట్ ఏమిటి?
వాసు, కాశీ, మధు.. ముగ్గురూ మంచి స్నేహితులు. కాశీ (నవీన్ చంద్ర)కు ఊరిలో 40 లక్షల వరకూ అప్పులున్నాయి. అవి తీర్చకపోతే.. ఇళ్లు జప్తు చేస్తారు. ఒక్కసారిగా 40 లక్షలు సంపాదించడం ఎలా? అందుకే క్రికెట్ బెట్టింగ్ లోకి దిగుతాడు. రాత్రికి రాత్రే కోటీ డభై లక్షలు సంపాదిస్తాడు. ఆ డబ్బు హవాలా రూపంలో తీసుకోవాలి. అక్కడి నుంచే చిక్కులు ఎదురవుతాయి. పోలీసులు ఈ మిత్ర త్రయాన్ని వెంటాడుతుంటాయి. డబ్బులు అందినట్టే అంది.. చేజారిపోతుంటాయి. చివరికి 1.7 కోట్లూ దక్కాయా, లేదా? వాటిని అందుకోవడంలో ఈ ముగ్గురు మిత్రులూ ఎన్ని సాహసాలు చేయాల్సివచ్చింది అనేదే కథ.
గంటా ఇరవై నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇది. వెండి తెరపై సినిమాగా చూపించడానికి సరైన సరంజామా లేదు. ఓటీటీకి మాత్రం పర్ఫెక్ట్. క్రికెట్ బెట్టింగులూ.. అవి జరిగే విధానం.. . వీటిపై దర్శకుడు కాస్త కసరత్తు చేసినట్టు అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రారంభ సన్నివేశాలు సాగుతాయి. ఎలాంటి గందరగోళం లేకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. పాత్రలు కూడా తక్కువే. వాటి చుట్టూనే కథ తిరుగుతుంది. బెట్టింగ్ లో సంపాదించిన 1.7 కోట్లు తిరిగి తెచ్చుకునే ప్రయత్నం నుంచి కథ ముదిరి పాకాన పడుతుంది. అప్పటి నుంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మొదలవుతాయి. గతంలో వచ్చిన స్వామి రారా సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అందులో విగ్రహం చేతులు మారుతూ ఉంటుంది. ఇందులో… డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి. కథంతా ఓ రాత్రి జరిగేదే. టైమ్ తక్కువ. రన్ టైమ్ కూడా తక్కువ. కాబట్టి.. స్క్రీన్ ప్లేని థ్రిల్లింగ్ గా మలిచే అవసరం, అవకాశం ఏర్పడ్డాయి. కథ, కథనంలో జిమ్మిక్కుల కంటే ప్రధాన పాత్రలు చేసే తెలివి తక్కువ యవ్వారాలే.. కథని మలుపు తిప్పుతుంటాయి. ఓరకంగా అవే ప్లస్సు.. అవే మైనస్సు అనుకోవాలి. సినిమా తీయడానికి కావల్సిన సరంజామా ఈకథలో లేదు. కాబట్టి.. వెబ్ మూవీకి పరిమితమైపోయారు. సైడ్ ట్రాకులు, పాటలు లేకపోవడం మరో ప్రధాన ప్లస్ పాయింట్. కాకపోతే.. గంటన్నర సినిమా కూడా అక్కడక్కడ బోర్ కొడుతుంటుంది. క్లైమాక్స్ ఇంకాస్త థ్రిల్లింగ్ గా ఉంటే బాగుండేది.
నవీన్ చంద్ర నటన చాలా సహజంగా ఉంటుంది. హీరో అని కాదు గానీ.. ఈ కథని నడిపించే పాత్ర అది. కాబట్టి హీరో అనాల్సిందే. చాందిని చౌదరి కూడా.. తన పరిధి మేర నటించింది. అజయ్, ప్రవీణ్ లాంటి వాళ్లు ఈ కథకు ప్లస్ అయ్యారు. ఓ రాత్రి జరిగే కథ ఇది. దానికి తగ్గట్టు లైటింగ్, మూడ్ క్రియేట్ చేయగలిగారు. చూస్తున్నంత సేపూ.. ఎంగేజ్ చేసినా, ఇంకా ఏదో లోటు కనిపిస్తూనే ఉంటుంది. ప్రేక్షకులు ఇలాంటి కథలకు, ట్విస్టులకు బాగా అలవాటైపోయారు. వాళ్లకు షాకింగ్ ఎలిమెంట్స్ ఇస్తే.. తప్ప సినిమా నచ్చదు. అలాంటి షాకింగ్ లు ఈ సినిమాలో కనిపించవు.
క్రికెట్ లో సూపర్ ఓవర్ అంటే కావల్సినంత థ్రిల్లింగ్, టెన్షన్ ఉంటాయి. వాటికి ఈ కథలో స్కోప్ ఉంది కూడా. కానీ… ఆ స్థాయిలో.. ఈ కథని నడపలేకపోయాడు దర్శకుడు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వుంది.. పైగా చిన్న సినిమా. కాబట్టి… టైమ్ పాస్ కోసం ఓసారి చూడొచ్చు. క్రికెట్ బెట్టింగులు, వాటి వెనుక ఉన్న మాఫియాకి సంబంధించిన అవగాహన ఉన్నవాళ్లకు ఇంకాస్త బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది.