చంద్ర బాబు కుటుంబం పై వైఎస్ఆర్సిపి నేతలు చేసిన వ్యక్తిగత దూషణ, దాన్ని ఖండిస్తూ నందమూరి కుటుంబం మొత్తం మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ సమస్య పై స్పందించిన తీరు టిడిపి అభిమానులకు సంతృప్తి నివ్వడం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. వివరాల్లోకి కి వెళ్తే..
ఎన్టీఆర్ స్పందన:
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు గత కొంత కాలంగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తయితే, అసెంబ్లీ సాక్షిగా వారు చేసిన వ్యాఖ్యలు ఆ వీడియో చూసిన వారికి అసహ్యాన్ని కలిగించాయి. దీనిపై చంద్రబాబు మరియు నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఊహించినట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. అయితే ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
నిన్న అసెంబ్లీ లో జరిగిన సంఘటన తనకు బాధ కలిగించిందని, రాజకీయాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలే తప్ప వ్యక్తిగత దూషణల కు పాల్పడకూడదు అని, ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఆడపడుచులపై దూషణకు దిగుతామో అప్పుడు అది ఒక అరాచకమైన సంస్కృతికి సాంప్రదాయానికి నాంది పలుకుతుందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. స్త్రీలను గౌరవించడం అనేది మన రక్తంలోనే ఉన్న సంప్రదాయం అని, ఇటువంటి సంప్రదాయాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పచెప్పాలి తప్పించి అటువంటి సంస్కృతిని కలచివేసేలా కాల్చి వేయడం తప్పు అని, ఈ మాటలు తాను బాధితురాలి కుటుంబ సభ్యుడిగా కాకుండా, ఒక పౌరుడిగా ఒక తండ్రిగా ఒక భర్తగా మాట్లాడుతున్నానని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. తమ ప్రవర్తన మార్చుకోవాలని, రాబోయే తరాలకు బంగారు బాటలు వేసేలా తమ ప్రవర్తన ఉండేలా చూసుకోవాలని రాజకీయ నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న వీడియో బైట్:
ఎన్టీఆర్ మాట్లాడిన విధానం, ఈ సమస్యపై స్పందించిన తీరు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఆయనను అభిమానించే అభిమానులకు కు విపరీతంగా నచ్చింది. మాట్లాడిన మాటలలోని స్పష్టత, సూటిదనం, దీని ని ఒక కుటుంబ సమస్య లా చూడకుండా సామాజిక సమస్య లా చూసిన విధానం ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
టిడిపి అభిమానుల లో మిశ్రమ స్పందన:
ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ ఆయన స్పందన టిడిపి అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదు. ఇన్ని వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ చంద్ర బాబు పేరును కానీ, వై ఎస్ ఆర్ సి పి పార్టీ పేరు ను కానీ నేరు గా ప్రస్తావించక పోవడం టిడిపి అభిమానులను అసంతృప్తి కి గురి చేసింది. దీనికి తోడు చంద్ర బాబు కుటుంబం పై దూషణ లకు పాల్పడ్డ నలుగురు ప్రముఖ వైఎస్సార్సీపీ నేతల లో ఇద్దరు అయినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ లు గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన నిర్మాతలే కాకుండా ఆయనకు సన్నిహితులు కూడా కావడం గమనార్హం.
దీని పై స్పందించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ “సుభాషితాలు బాగున్నాయి @tarak9999 . కుటుంబ సభ్యుడి గా కాకుండా సంఘ సంస్కర్తలాగా ఎంతో పరిణతితో మాట్లాడారు. అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరి పైన జరిగింది, ఎవరి వల్ల జరిగిందో కూడా ప్రస్తావించకుండా.. నిజంగా అద్భుతం.” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
మరొక అభిమాని వీడియో బైట్ విడుదల చేస్తూ, చంద్ర బాబు కుటుంబం పై దూషణల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని, ఈ విధంగా స్పందించే బదులు అసలు స్పందించకుండా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అనే పదంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ‘కర్ర విరగదు.. పాము చావదు’ అనే సామెత తీరు లో స్పందించడం పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం మీద ఎన్టీఆర్ స్పందన పై టీడీపీ అభిమానుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.