ఎన్టీఆర్ – కృష్ణలది గొప్ప అనుబంధం. వారిద్దరి కాంబినేషన్లో మంచి సినిమాలొచ్చాయి. నిజానికి… ఎన్టీఆర్ అంటే.. కృష్ణకు ఎనలేని అభిమానం. ఈ అనుబంధాన్ని, తన అభిమానాన్నీ ఎన్టీఆర్ వేదికపై పంచుకున్నారు కృష్ణ.
”చిన్నప్పటి నుంచీ నేను రామారావు గారి అభిమానిని. డిగ్రీ పూర్తయ్యాక రామారావుగారిని చూడ్డానికే మద్రాస్ వెళ్లా. నాకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉంది.. మీ సినిమాలో ఏదైనా వేషం ఇవ్వండి అని అడిగా. చిన్నకుర్రాడిలా ఉన్నావ్.. రెండు మూడేళ్లు ఆగితే నీకు అవకాశం ఇస్తా అని రామారావుగారు నాతో చెప్పారు. ఈలోగా ఆదుర్తి సుబ్బారావు గారు తేనెమనసు సినిమాలో అవకాశం ఇచ్చారు. నా 5వ సినిమా స్త్రీ జన్మలో తమ్ముడిగా తొలిసారి నటించా. నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం.. ఇలా మూడు సినిమాలు హిట్టయ్యాయి. పండంటి కాపురం ఫంక్షన్ కోసం ఎన్టీఆర్ విజయవాడ వచ్చారు. నా తదుపరి సినిమా ఆయనతో తీయాలని వుందని.. స్టేజీపైనే చెప్పా. తప్పకుండా నటిస్తా అని అప్పటికప్పుడు మాట ఇచ్చారు. దేవుడు చేసిన మనుషులు కథ చెప్పా. ఆ సినిమా ఆఖండ విజయం సాధించింది. ఆయనతో కలసి చేసిన అన్ని సినిమాల్లోనూ నేను తమ్ముడిగానే నటించా. మొన్న ఇంటికి వచ్చినప్పుడు బాలకృష్ణగారు ఈ సినిమాలో వేసిన గెటప్పులు చూపించారు. వంద శాతం… రామారావుగారిలానే కనిపించారు. తప్పకుండా ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయం సాధించి.. బాలకృష్నగారికి గొప్ప పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా” అన్నారు కృష్ణ.