సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూశారు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రి చేరారు కృష్ణ. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో ఆయన్ని ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశారు వైద్యులు. అనంతరం ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
కృష్ణ 1943,మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. 1964లో ‘తేనె మనసులు’ చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు. ‘గూఢచారి 116’ ఆయనకి మంచి బ్రేక్ ఇచ్చింది. మోసగాళ్లకు మోసగాడు,పండంటికాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, సాక్షి ,దేవదాసు, కురుక్షేత్రం, భలే దొంగలు, మనస్సాక్షి, ఈనాడు, సింహాసనం, ముద్దు బిడ్డ, నంబర్ 1′ వంటి చిత్రాలు ఆయన కెరీర్ లో మైలురాయి చిత్రాలుగా నిలిచాయి.
కృష్ణ 1962లో ఇందిరాదేవిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. విజయ నిర్మల ని ప్రేమ వివాహం చేసుకున్నారు కృష్ణ. మొదటి భార్య ఇందిరా దేవి ఇటీవలే మరణించారు. రెండో భార్య విఙయనిర్మల, కొడుకు రమేష్‌బాబు కూడా కొన్నేళ్ల క్రితం మరణించారు. ఇప్పుడు కృష్ణ మరణంతో మహేష్ బాబు కుటుంబంతో పాటు పరిశ్రమ కూడా ఓ పెద్ద దిక్కుని కోల్పోయినట్లయింది.