తెలుగు సినీ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన చరిత్ర సూపర్ స్టార్ కృష్ణకు సొంతం. ఒకటా రెండా..? ఎన్ని వందల సినిమాలు..? ఆయని చూడని రికార్డ్ లేదు. ఆయన నడవని పంథా లేదు. సినిమా కథల్లో ఎన్ని జోనర్లు ఉన్నాయో.. వాటన్నింటినీ టచ్ చేశారు. అన్నింట్లోనూ హిట్లు కొట్టారు. ఆయన చేయని ప్రయోగం లేదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా చిత్రసీమకు అన్నిరకాలుగానూ సేవలు అందించారు. ఆయన ప్రయాణంలో అద్భుతమైన మజిలీలెన్నో ఉన్నాయి. ఒక్కసారి సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌ని పునరాలోకనం చేసుకొంటే..
బుర్రిపాలెం నుంచి.. సూపర్ స్టార్ వరకూ
కృష్ణ 1943,మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చిత్ర రంగం వైపు అడుగులు వేశారు. మొదట నాటకాలు ఆడారు. 1960లో చేసిన పాపం కాశీకెళ్ళినా అనే నాటకంలో కృష్ణ నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం. ఆ తర్వాత భక్త శబరి, సీతారామ కళ్యాణం, ఛైర్మన్ వంటి నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకునారు. నాటకాల్లో రాణించడంతో..మద్రాసు చేరి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు కృష్ణ. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ 1964లో ‘తేనె మనసులు’ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం చేసిన ఆ సినిమాలో బసవరాజు అనే పాత్రతో ప్రేక్షకుల మనసులో ముద్రవేసుకున్నారు. ఆ తర్వాత మరో సినిమా చేసినా.. హీరోగా నటించిన మూడో చిత్రం ‘గూఢచారి 116’ ఆయనకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. తెలుగు జేమ్స్ బాండ్ గా కృష్ణ పేరు మార్మ్రోగిపోయింది.
డెబ్భై, ఎనభైల కాలంలో కృష్ణ హవా నడిచింది. యేటా పదికి తగ్గకుండా సినిమాలు చేసేవారు. ఒక సంవత్సరమైతే ఏకంగా పద్దెనిమిది సినిమాల్లో నటించారు. అదో చరిత్ర. గూఢచారి 116, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు,పండంటికాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, సాక్షి ,దేవదాసు, కురుక్షేత్రం, భలే దొంగలు, మనస్సాక్షి, ఈనాడు, సింహాసనం,ముద్దు బిడ్డ, నంబర్ 1′ వంటి చిత్రాలు కృష్ణ నటన జీవితంలో మైలురాయిగా నిలిచాయి.
అల్లూరి ఓ చరిత్ర
తెలుగు సినీ పరిశ్రమకి చాలా కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణదే. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 ఆయనే చేశారు. మొదటి కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు చేసిందీ ఆయనే. తొలి ఫుల్ స్కోప్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో శభాష్ అనిపించుకున్నారు. నటుడిగా వెలిగిపోతున్నప్పుడే డైరెక్టర్‌గానూ, నిర్మాతగానూ మారారు కృష్ణ. తన తమ్ముళ్లతో కలిసి పద్మాలయ పిక్చర్స్ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు చేశారు.
సోలోగా ఎన్ని సినిమాలు చేసేవారో.. ఇతర హీరోలతో కలిసి అన్ని సినిమాలు చేసేవారు కృష్ణ. మల్టీస్టారర్ కు ఎప్పుడూ నో చెప్పేవారు కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు దగ్గర్నుంచి రజినీకాంత్, మోహన్‌బాబు లాంటి వారి వరకు పలువురితో కలిసి నటించారు. ఆయన హీరో ఫ్రెండ్లీ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ కూడా. కృష్ణ నిర్మాతల హీరో. ఆయన సాహసాలకు పెట్టింది. కృష్ణ 1962లో ఇందిరాదేవిని పెళ్ళి చేసుకున్నారు. ఇందిరాదేవి కృష్ణ మేనమామ కూతురు. వీరికి ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. విజయ నిర్మల ని ప్రేమ వివాహం చేసుకున్నారు కృష్ణ.
పద్మభూషణుడు
2008లో ఆంధ్రా యూనివర్సిటీ సూపర్ స్టార్ కృష్ణకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గానూ..కేంద్రం 2009లో పద్మభూషణ్ పురస్కారంతో కృష్ణను గౌరవించింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఫిల్మ్ ఫేర్ లైఫ్ ఎఛీవ్మెంట్ పురస్కారం లభించింది. 1972లో వచ్చిన పండంటి కాపురం చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. సూపర్ స్టార్ అనే బిరుదుకి వన్నె తెచ్చిన అజరామరంగా నిలిచారు కృష్ణ.