కొన్ని పాత్రలు కొందరి కోసం తయారు చేయబడతాయి. మరొకరు వాటి జోలికి వెళ్లలేరు. మరొకర్ని ఆ పాత్రలో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర ‘అల్లూరి సీతారామరాజు’. ఆ పాత్రలో నటించే అపురూపమైన అవకాశం సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే దక్కింది. ఆయన తప్ప ఈ పాత్రకు ఇంకెవరూ న్యాయం చేయలేరేమో అన్నంత గొప్పగా అల్లూరి అవతారం ఎత్తారు కృష్ణ. ఆయన కెరీర్లో ఈ చిత్రం ఓ మైలు రాయి. ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి సరిగ్గా 50 ఏళ్లు.
కృష్ణ డ్రీమ్ రోల్స్ లో ‘అల్లూరి’ ఒకటి. ఆయన సినిమాల్లోకి రాక ముందు నుంచే ‘అల్లూరి సీతారామరాజు’ పాత్ర వెంటాడింది. అందుకు ఎన్టీఆర్ కూడా ఓ బలమైన కారణమే. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమాలో అల్లూరి ధైర్య సాహసాల్ని ఓ బుర్రకథగా చెప్పే సన్నివేశం ఉంది. అది కృష్ణకు చాలా ఇష్టం. అప్పట్లో ఎన్టీఆర్ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చేద్దామనుకొన్నారు. లుక్ టెస్ట్ కూడా జరిగింది. అది బయటకు వచ్చింది కూడా. అలా అల్లూరి సీతారామరాజు గెటప్.. కృష్ణని బాగా ఊరించింది. ఆ తరవాత కృష్ణ హీరో అయ్యారు. ‘అసాధ్యుడు’ చిత్రంలో అల్లూరి గెటప్ లో కనిపించారు. అల్లూరిగా కృష్ణ బాగా సూటయ్యారని కితాబులు అందుకొన్నారు. ‘అసాధ్యుడు’లో కనిపించింది కాసేపే అయినా, ఆ లుక్ తనలో ధైర్యాన్ని నింపింది. ఎన్టీఆర్ కొన్ని కారణాల వల్ల ‘అల్లూరి’ స్క్రిప్టు పక్కన పెట్టడంతో.. కృష్ణ స్వయంగా తన భుజాలపై వేసుకొన్నారు. తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ముగ్గురు దర్శకులు
1973 డిసెంబరులో అప్పటి మద్రాస్ వాహినీ స్టూడియోలో ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం చింతపల్లి అడవుల్లో భారీ సెట్స్ వేశారు. చిత్రబృందం అంతా షూటింగ్ జరిగినన్ని రోజులూ అక్కడే బస చేసి, 40 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. ఈ చిత్రానికి రామచంద్రరావు దర్శకుడు. అయితే కొంతమేర షూటింగ్ జరిగాక ఆయన అస్వస్థతకు గురవ్వడం వల్ల.. అర్థాంతరంగా చనిపోయారు. దాంతో మిగిలిన భాగానికి కృష్ణ దర్శకత్వం వహించారు. కొన్ని సన్నివేశాల్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. అయితే తెరపై దర్శకుడిగా రామచంద్రరావు పేరే పడుతుంది. అది కృష్ణకు ఆయనపై ఉన్న గౌరవం.
1974 మే 1న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకొంది. తెలుగులో నిర్మితమైన తొలి సినిమా స్కోప్ చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పట్లోనే రూ.2 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’ పాటకు శ్రీశ్రీ జాతీయ పురస్కారం అందుకొన్నారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ఇదే. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ చేస్తున్నాడని తెలుసుకొన్న ఎన్టీఆర్ మొదట్లో కాస్త బాధ పడ్డారు. ‘నేను చేయాల్సిన కథ కదా’ అనుకొన్నారు. కానీ ‘అల్లూరి సీతారామరాజు’ చూశాక… ‘బాగా చేశారు బ్రదర్. నేను కూడా ఇంత బాగా చేసేవాడ్ని కాదేమో’ అని మెచ్చుకొన్నారు.