సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. గత పది రోజులుగా ఆయన హైదరాబాద్‌లో అన్నాత్తే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే.. ఆ సినిమా యూనిట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. హైదరాబాద్‌లోనే.. రజనీకాంత్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఈ ఉదయం హఠాత్తుగా బీపీ పెరగడంతో.. ముందు జాగ్రత్తగా అపోలో ఆస్పత్రికి తరలించారు.
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని.. ఎవరూ ఎలాంటి పుకార్లు వ్యాపింపచేయవద్దని.. అపోలో ఆస్పత్రి యాజమాన్యం కోరింది. రజనీకాంత్‌కు కరోనా సోకలేదని స్పష్టం చేసింది. రజనీకాంత్ ఆరోగ్య పరంగా సున్నితమైన వ్యక్తి. గతంలో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ రూమర్సేనని.. తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ఆయన ప్రకటించారు.
అన్నాత్తే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అన్నాత్తే షూటింగ్ ఆగిపోవడం.. ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో… అభిమానుల్లో టెన్షన్ ప్రారంభమయింది. ఈ ఏడాది చివరిలో అంటే.. మరో వారంలో ఆయన పార్టీని ప్రకటించాల్సి ఉంది.