రజనీకాంత్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. `రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు` అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నేను రాజకీయాలకు రెడీ అని రజనీ చెప్పినా.. ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. 2019 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నా.. రజనీ ముందుకు కదలడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీ స్థాపించడం, దాన్ని ముందుకు నడిపించడం సామాన్యమైన విషయాలు కాదని రజనీకి తెలుసు. మీడియా సపోర్ట్ తనకు చాలా అవసరం. అందుకే ఈ విషయంలో ముందు జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. అందులో భాగంగా ఓ టీవీ ఛానల్‌ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు టాక్.
‘తలైవా టీవీ, రజనీ టీవీ, సూపర్‌స్టార్ టీవీ’ అనే మూడు పేర్లని రజనీకాంత్‌కి చెందిన ఆర్ఎంఎం సంస్థ నమోదు చేసింది.ఈ ఛానల్‌ని రజనీకాంత్ అభిమానులు, ఆర్ఎంఎం సభ్యులు కలసి ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించి రజనీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో రజనీ పెట్టుబడి ఉందా, లేదా? అన్నదే తెలియడం లేదు. అయితే ఛానల్ లోగోపై మాత్రం రజనీ ఫొటో, పేరు వాడుకోవడానికి రజనీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. ప్రతీ పార్టీకి ఓ ఛానల్, పేపర్ ఉండడం ఇప్పట్లో ఆనవాయితీగా మారింది. దాన్ని రజనీకాంత్ కొనసాగిస్తున్నారన్నమాట.