భావసారూప్యం ఉన్న పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీ పొత్తులు పెట్టుకుంటుందని చెప్పలేదు కానీ.. పొత్తులు ఎవరు పెట్టుకోవాలో .. పెట్టుకుంటారో అనేదానికి భావసారూప్యం అనే అర్హతను చెప్పారు. తమ పార్టీ సింగిల్‌గా వస్తుందని చెబుతున్నారు. అంటే వైసీపీతో భావసాపూర్యం ఉన్న పార్టీలు అస్సల్లేవన్నమాట. ఉంటే గింటే అది కాంగ్రెస్సే అయి ఉండాలి.. ఎందుకంటే.. పార్టీ నుంచి వచ్చిన చీలికే వైసీపీ, అందుకే కాదు పేరులో కూడా కాంగ్రెస్ అని ఉంది.
కాంగ్రెస్‌తో తప్ప ఇంకే పార్టీతో వైసీపీకి భావసారూప్యం లేదు. బీజేపీ – వైసీపీ మధ్య బంధం బహిరంగం. కానీ నేరుగా పొత్తు పెట్టుకోలేనంత భావ వైరుధ్యం ఉంది. పొత్తులు మాత్రమే పెట్టుకోలేదు కానీ అన్ని రకాల సంబంధాలు కొనసాగిస్తోంది. జగన్‌కు జనసేన పార్టీ దూరం. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించి ఆయన సామాజికవర్గాన్ని దారుణంగా వంచించి .. జగన్ పూర్తిగా దూరం చేసుకున్నారు. సీపీఎం జగన్ తో కాస్త చనువుగా ఉన్నా.. పొత్తు పెట్టుకోలేదు. ఆ పార్టీ కూడా పెట్టుకునేందుకు ముందుకు రాదు. ఇక సీపీఐ నారాయణ జగన్ ను రాజకీయశత్రువుగా ప్రకటించారు. రెండు కమ్యూనిస్టు పార్టీలు దూరమే.
తెర వెనుక సంబంధాలే తప్ప.. తెర ముందు ఎలాంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోవడానికి వైసీపీకి భావ సారూప్యత పనికి రాదు. సింహం సింగిల్‌గా వస్తుందని స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి ఈ పరిస్థితి ఉపయోగపడుతోంది. వైసీపీ ఇప్పటి వరకూ పైకి సింగిల్‌గానే కనిపించినా… ఎన్నో శక్తులు సహకరించ బట్టే గత ఎన్నికల్లో విజయం సాధించింది. అలా సహకరించిన వాటిలో బీజేపీ, టీఆర్ఎస్ కూడా ఉన్నాయి. అయితే నిజంగా పొత్తులకు ప్రయత్నించినా ఆ పార్టీతో కలిసేందుకు ఏ పార్టీ కూడా లేదనేది కళ్ల ముందు కనిపిస్తున్న నిజం.