చిన్నా పెద్దా, జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు అని తేడా లేకుండా ఫిరాయింపుల సంస్కృతి రాజ్యమేలుతోంది. ఒక పార్టీ ఇచ్చిన టిక్కెట్ మీద ప్రజా ప్రతినిధిగా గెలవడం… ఆ పదవికి రాజీనామా చేయకుండానే అధికార పార్టీలో చేరిపోవడం, పదవులు పొందడం అనేది ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు కొంత హడావుడి చేస్తే… సదరు ఫిరాయింపు నేత ఒక మొక్కుబడి రాజీనామా చేస్తారు. దాని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోరు. సంవత్సరాలు గడిచిపోతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గతంలో అధికారంలో ఉన్న పార్టీలు చేసిన పనులివే. ఫిరాయింపుదారులపై న్యాయ పోరాటం చేయాలని ఎవ్వరు భావించినా… స్పీకర్ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు లబ్ది పొందుతూనే ఉన్నాయి. ఇప్పుడీ చర్చ అంతా ఎందుకంటే… ఇదే అంశంపై సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు ఇవాళ చేసింది.
ప్రజాప్రతినిధులపై అనర్హత పిటీషన్లను స్పీకర్లు కాకుండా, ఒక స్వతంత్ర వ్యవస్థ విచారించే పద్ధతి గురించి పార్లమెంటు ఆలోచించాలని సుప్రీం సూచించింది. అనర్హత విషయంలో సభాపతికి ఉన్న ప్రత్యేక అధికారాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉంటూ అనర్హతలపై ఆయనొక్కరే ఎలా నిర్ణయాలు తీసుకుంటారంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ఫిరాయింపునకు పాల్పడ్డ ఎమ్మెల్యే లేదా ఎంపీని ఒక్కరోజు కూడా ఆ పదవిలో కొనసాగించరాదని కోర్టు చెప్పింది. మణిపూర్ మంత్రి శ్యామ్ కుమార్ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి, భాజపా ప్రభుత్వంలో చేరారు. ఆయనపై వేటు వేయాలంటూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. మూడు నెలల్లోపు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, లేదంటే మరోసారి న్యాయస్థానానికి రావొచ్చని సుప్రీం చెప్పింది.
ఫిరాయింపులపై సుప్రీం వ్యాఖ్యలు చాలా కీలకమైనవే. అయితే, వీటిని ఎవరు పట్టించుకుంటారు? ఫిరాయింపుల అంశంలో స్పీకర్ కి ఉన్న విశేషాధికారాలకు కోత పెట్టే ప్రయత్నం ఎవరు చేస్తారు? వాస్తవానికి, ఈ ఫిరాయింపులు అధికారంలో ఉన్నవారికే ఎక్కువగా ఉపయోగపడున్నాయి. సభల్లో చట్టాలు చేసే అధికారమూ వాళ్లకే ఉంటుంది కదా? అలాంటప్పుడు, పార్లమెంటులో ఎవరు దీని గురించి ఆలోచించాలి? అధికార పార్టీ ఆలోచిస్తుందా..? ప్రతిపక్షాలు ఈ చర్చను లేవనెత్తినా కంఠశోష తప్ప ప్రయోజనం ఉంటుందా..? సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద చర్యలకు సంబంధించిన ఒక చర్చ ప్రారంభమయ్యే అవకాశం మాత్రమే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ధర్మాసనం అభిప్రాయపడ్డట్టు ఫిరాయింపుదారుడు మీద ఒక్క రోజులో అనర్హత వేయగలిగే చట్టాలను పార్లమెంటు చేయగలిగితే మంచిదే. అలాంటి పరిస్థితి రావాలనే ఆశావహ ద్రుక్పథం ఉండాలి.