సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రాలో కోడి పందేల సందడి అంతా ఇంతా కాదు! పండుగ వారం రోజులూ పందేల జోరు మామూలుగా ఉండదు. ఇక, బెట్టింగుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కోట్లలో డబ్బులు చేతులు మారుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కోడి పందేల జోరు తగ్గుతుందని అనుకున్నారుగానీ… వాస్తవ పరిస్థితిలో మార్పు లేదు. ముందస్తు పందేలు ప్రారంభమైపోయాయి. ఇప్పటికే చాలా పందెం రాయుళ్ల కోసం లాడ్జీలన్నీ బుక్ అయిపోయి ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, కోడి పందేల నిర్వహణ వ్యవహారం ఇప్పుడు నెమ్మదిగా సుప్రీం కోర్టు వరకూ వెళ్లడం విశేషం!
ఇప్పటికే కోడి పందేల నిర్వహణపై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోడిపందేలకు అనుమతులు లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఈ ఏడాది కాస్త కఠినంగానే పోలీసులు వ్యవహరించే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ, కింది కోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టును ఆశ్రయించారు భాజపా నాయకుడు రఘురామకృష్ణం రాజు. ఈ క్రీడ ఎప్పటి నుంచో వస్తున్న ఒక సంప్రదాయమనీ, ఇందులో ఎలాంటి హింసకూ తావు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కోళ్ల కాళ్లకు కత్తులు లేకుండా క్రీడల్ని నిర్వహించుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయన అంటున్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ… కోళ్లను స్వాధీనం చేసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం విశేషం! ఓపక్క ప్రతివాదులకు తాత్కాలికంగా నోటీసులు జారీ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేసింది.
కోళ్లను స్వాధీనం చేసుకోవద్దనీ, కానీ పందేల కోసం ఉపయోగించే కత్తుల్నీ ఇతర ఆయుధాలను మాత్రం సీజ్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. టూకీగా చెప్పాలంటే… పందేలు నిర్వహించుకోవచ్చని కోర్టు చెప్పినట్టుగా భావించుకోవచ్చా అనే అభిప్రాయం కలుగుతోంది. పందేల్లో కత్తులు లేకపోతే సరిపోతుందన్నమాట! కత్తుల సంగతి సరే… మరి, కోడి పందేలు సందర్భంగా కోట్లలో సాగే బెట్టింగుల మాటేంటీ..? పందేలు సంప్రదాయం అనుకుందాం! మరి, భారీ మొత్తంలో బెట్టింగులు..? వాటిని ఎలా సమర్థించుకుంటారు! ఆయుధాలు లేనంత మాత్రాన హింస లేకుండా ఎలా ఉంటుంది..? రెండు కోడిపుంజులు ఒకదానిపై ఒకటి కలబడి పొడుచుకుంటూ ఉంటే అది హింస కాదా..?