జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేతలపై కేంద్రం దేశ ద్రోహ నేరం మోపడంపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. జెఎన్‌యు పూర్వ విద్యార్థి ఎన్.డి.జయప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఇది త్వరితంగా విచారించవలసిన ప్రజాప్రాధాన్య అంశమని న్యాయస్థానం అంగీకరించడంపై విద్యార్థులు తలిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో దేశద్రోహ నేరం ఆరోపణలపై దర్యాప్తును ఎన్ఐఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి అప్పగించాలని దాఖలైన పిటిషన్‌ను డిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ పోలీసులు దీన్ని విచారించగలరని స్పష్టం చేసింది. ఈ విధంగా రెండు దశల్లో ప్రభుత్వ ప్రయత్నాలకు చుక్కెదురైంది.
జాతిద్రోహానికి పాల్పడినట్టు ప్రచారం చేస్తున్న సంఘ పరివార్‌కు సుప్రీం నిర్ణయం చెంపపెట్టే. విద్యార్థులు ప్రభుత్వంపై చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలనే కోర్టు భావించింది తప్ప అభిశంసించలేదు. అలాగే టెర్రరిస్టు వ్యతిరేక చర్యల నిరోధానికి ఉద్దేశించిన ఎన్‌ఎస్‌ఎను విద్యార్థులపై ప్రయోగించడానికి హైకోర్టు నిరాకరించచడం కూడా గమనించదగ్గ విషయం. సోమవారం నాడు కోర్టులో బిజెపి ఎంఎల్ఎ వోఎల్శర్మతో సహా పలువురు విద్యార్థులపైన, జర్నలిస్టులపైన లాయర్లపైన దౌర్జన్యానికి పాల్పడటం కూడా తీవ్ర విమర్శకు గురైంది. మీడియా సంస్థలు కూడా ఖండించాయి. అధ్యాపకులు కూడా తరగతులు బహిష్కరించడమే గాక జాతీయ భావన గురించి బయిటే తాము క్లాసులు తీసుకుంటామని ప్రకటించారు.
బడ్జెట్ సమావేశాల ముందస్తుగా కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ ఈ విషయమై పార్లమెంటులోచర్చకు అంగీకారం తెలిపారు. తాను దేశమంతటికీ ప్రధానిని తప్ప బిజెపికి మాత్రమే కాదని కూడా ఆయన అన్నారు..
మరోవైపున ఢిల్లీ యూనివర్సీటీ ప్రొఫెసర్ జిలానీని పోలీసులు మంగళవారం తెల్లవారుఝామున అరెస్టు చేశారు. అఫ్టల్ గురుకు సంబంధించి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయనే సూత్రధారి అని ఆరోపిస్తున్నారు. ఆసక్తికరమేమంటే జిలానీ 2013 నుంచి ఈ సమస్య లేవనెత్తుతున్నారు. కోర్టుల్లోనూ పోరాడారు. ఆయనను ఈ కేసునుంచి కోర్టులే విడుదల చేశాయి.
అప్పుడు కూడా ఎబివిపి అనేక విధాల రభస చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అనుకూల ప్రభుత్వం వుంది గనక వారి ఫిర్యాదులకు ప్రభావం పెరిగింది. దేశానికి వ్యతిరేకంగా విదేశాలకు అనుకూలంగా ఎవరు నినాదాలు చేశారో బయిటపెడితే అరెస్టు చేసి చర్యలు తీసుకోవచ్చని అన్ని పక్షాలూ చెబుతున్నాయి.ఆ పని చేసేందుకుబదులు మరింత ఉద్రిక్తత పెంచేందుకు ప్రయత్నాలు చేయడం దారుణం. అధికారంలో వున్న వారు కుట్రలపై ముందే నిఘా వేసి పట్టుకోవాలి. సమస్యలుంటే విద్యార్థులకు నచ్చజెప్పి తమతో తీసుకెళ్లడం జరగాలి.
ఇప్పటికి అప్జల్‌గురును ఆరాధించే పిడిపితో కాశ్మీర్లో చెలిమి చేస్తూ ఇక్కడ ఏ సాక్ష్యాధారాలు చూపేకుండానే కేవలం ఎబివిపి ఆరోపణలపై వామపక్ష విద్యార్థిసంఘాల నేతలను కేసులు మోపడం ఏమిటనే ప్రశ్నకు బిజెపి నుంచి సరైన సమాధానమే లేదు.
హెచ్‌సియు నుంచి జెఎన్‌యు దాకా ఎబివిపి ఫిర్యాదు, ఆరెస్సెస్ పురమాయింపు, కేంద్ర మంత్రుల వత్తాసు, పోలీసుల చొరబాటు, అరెస్టులు – ప్రతిచోటా ఇదే ఒక ఫార్ములాగా మారితే విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి ఏమయ్యేట్టని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరితో చర్చించి ఈ విద్వేష వాతావరణాన్ని ఉద్రిక్తతను ఎంత త్వరగా చక్కదిద్దితే అంత మంచిది.
అరెస్టయిన కన్నయ్య కుమార్ ప్రసంగం ప్రస్తుతం సోషల్ వెబ్సైట్లలో సంచరిస్తున్నది. దాన్ని చదివితే అతని పరిపక్వత, స్పష్టత తెలుస్తాయి. కుమార్ ఒక అంగన్వాడీ కుమారుడు. అభ్యుదయ ఉద్యమాలలో భాగస్వామి. అలాటి వ్యక్తిని దేశద్రోహిగా అరెస్టు చేయడం ఎవరూ ఆమోదించలేకపోతున్నారు. ఇలాటి పరిస్థితి రావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమనే విమర్శలు తీవ్రంగా నడుస్తున్నాయి.