సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమయినా కోర్టులలో రెండు మూడుసార్లు మొట్టి కాయలు పడగానే మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడుతుంటాయి. కానీ తెలంగాణా ప్రభుత్వానికి నెలకొకసారయినా ఏదో ఒక కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయినట్లు కనిపిస్తోంది. బీసీల జాబితా నుండి శెట్టి బలిజలను తొలగించినందుకు వారు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే, వారి పిటిషన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఏ ప్రాతిపదికన వారిని బీసీల జాబితా నుండి తొలగించారని ప్రశ్నిస్తూ నోటీసు జారీ చేసింది. ఈనెల 24వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పార్లమెంటరీ కార్యదర్శులకు కేబినేట్ హోదా కల్పించడంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు నెలల క్రితం తను ఇచ్చిన నోటీసుకు తెలంగాణా ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడంతో ఇవ్వాళ్ళ మళ్ళీ నోటీసు జారీ చేసింది. ఈసారి నిర్లక్ష్యం చేసినట్లయితే తెలంగాణా ప్రభుత్వానికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది కూడా. బహుశః దేశంలో మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వంలాగ కోర్టుల చేత ఇన్నిసార్లు మొట్టి కాయలు వేయించుకొని ఉండవేమో?