సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులు సంచలనాన్ని రేపుతున్నాయి. ఓ హైకోర్టు జడ్జి మానసిక స్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలనేది ఆ ఉత్తర్వు. కోల్‌కతా హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ సిఎస్ కర్ణన్ ఈ ఎపిసోడ్లో హీరో. ఓ న్యాయమూర్తి మానసిక స్థితినే పరిశీలించాలని ఆదేశాలిచ్చేంత అవసరమేమొచ్చింది? జస్టిస్ కర్ణన్ ఈ ఏడాది జనవరి 23న ప్రధానికి రాసిన ఓ లేఖ, తదుపరి నేపథ్యం దీనికి కారణంగా. సుప్రీం కోర్టుకు చెందిన సర్వీసులో ఉన్న, రిటైరైన న్యాయమూర్తులు 20మంది అవినీతిపరులనేది ఆ లేఖ సారాంశం. మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉండగా ఈ లేఖ రాశారు అక్కడి నుంచి సమస్య ప్రారంభమైంది. జస్టిస్ కర్ణన్‌పై విమర్శలు మొదలయ్యాయి. ఆయన్ను బెంగాల్ హైకోర్టుకు బదిలీ చేశారు. అయినా ఆయన విమర్శలు ఆగలేదు. సరికదా.. ముమ్మరమయ్యాయి. ఏడుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు విమానంలో ప్రయాణించడానికి వీల్లేకుండా ఆయన ఆదేశాలు జారీ చేశారు. జూన్ 8వ తేదీన జస్టిస్ కర్ణన్ పదవీ విరమణ చేయాల్సుంది. వాస్తవానికి ఇలాంటి న్యాయమూర్తిని విధుల్నుంచి తొలగించేసి, తీవ్రమైన శిక్ష విధించడం సుప్రీంకు చిటికెలో పని. కానీ అత్యున్నత న్యాయస్థానం ఆ పని చేయలేదు. తమ మాటనే ఖాతరు చేయడా అనుకుంది. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానానికి హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. సవాలుగా తీసుకుని, తాడోపేడో తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ కేహార్, న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, జె. చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ బి లోకుర్, పిసి ఘోష్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన బెంచ్ కర్ణన్ మానసిక స్థితి ఏమిటో తేల్చాలని ఆదేశించింది. ఆయన హైకోర్టు న్యాయమూర్తి కాబట్టి, ఇబ్బందులు ఏర్పడకుండా కోల్‌కతా లోని పావ్లోవ్ ఆస్పత్రికి చెందిన వైద్యులతో బృందాన్ని ఏర్పాటుచేసింది. వారు కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించింది. దీనికి ముందు బెంచ్ చేసిన వ్యాఖ్య అసాధారణంగా ఉంది. ఆ వ్యాఖ్యే కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
జస్టిస్ కర్ణన్ వైఖరి చూస్తుంటే సుప్రీం న్యాయమూర్తుల బెంచ్‌నే తన ముందు హాజరుకావాలన్నట్లుగా ఉందన్నది ఆ వ్యాఖ్య. కోర్టు ఆదేశాల ఉల్లంఘన ఎదుర్కొంటున్న ఎవరైనా దాన్ని పాటించాల్సిందే. దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సైతం కోర్టుకు హాజరయిన ఉదంతం దీనికి ఉదాహరణ. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. న్యాయపరిరక్షణ చేయాల్సిన న్యాయమూర్తే దాన్ని కాలరాయడం దేనికి సంకేతం. అందుకనే సుప్రీం బెంచ్ అసాధారణ ఆదేశాలను జారీ చేసింది. మానసిక స్థితి సరిగా లేకనే ఆయనలా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడింది. రెండు నెలల్లో ఎలాగూ పదవీ విరమణ చేస్తున్నారనీ, విడిచి పెట్టాలనీ ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదననూ అంగీకరించలేదు. ఆయన రిటైరైనా ఈ సమస్య ఆగుతుందనుకోవడం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. జస్టిస్ కర్ణన్ జారీ చేసిన ఆదేశాలను దేశంలోని ఏ ప్రభుత్వ సంస్థా పాటించాల్సిన అవసరం లేదని కూడా ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలకు జస్టిస్ కర్ణన్ అంగీకరించలేదు. మే 8వ తేదీలోగా వైద్యుల బృందం నివేదిక సమర్పించాలంటే.. ఎంతో కొంత గందరగోళం తప్పదనే అనిపిస్తోంది. అత్యున్నత న్యాయస్థానమే సవాలుగా తీసుకున్నందునే ఈ కేసు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాను దళితుడను కాబట్టే వివక్ష చూపిస్తున్నారని జస్టిస్ కర్ణన్ ఆరోపించడం దీనికి కొసమెరుపు.
–సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి