గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న అక్రమ మైనింగ్ కేసుల్లో విచారణను రోజువారీగా చేసి ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో పెద్దగా ప్రచారం కాని మరో కేసు విచారణలో… ప్రజాప్రతినిధులపై ఉన్న సీరియస్ కేసులు.. ముఖ్యంగా నాలుగేళ్ల పాటు విచారణ జరగకుండా పెండింగ్లో పడిపోయిన కేసుల వివరాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఇలా ఆదేశాలు జారీ చేయడానికి గాలి జనార్ధన్ రెడ్డి కేసు నేపధ్యమే కారణం.
కేసు నమోదై.. పన్నెండేళ్లు గడుస్తున్నా.. విచారణ ముందుకు సాగలేదు. రకరకాల పిటిషన్లతో ఆలస్యం చేస్తున్నారు. దీంతో పలుకుబడి ఉన్న వారి విషయంలో న్యాయవ్యవస్థ మరో విధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో సీజేఐ ఎన్వీ రమణ ఉన్నప్పుడు ఏడాదిలో కేసుల విచారణ పూర్తి చేయాలన్న ఆదేశాలిచ్చారు . కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నాలుగేళ్లకుపైగా విచారణ జరగని కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
సీఎం జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులు.. దేశంలో ఉన్న అందరు రాజకీయ నేతలందరికన్నా తీవ్రమైనవి. ఆయన కేసులు కూడా పన్నెండేళ్లుగా విచారణ సాగడం లేదు. ఇప్పటికి ఒకరి తర్వాత ఒకరు నిందితులు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. బెయిల్ పిటిషన్లనీ.. విచారణ వాయిదా పిటిషన్లను వాయిదా వేస్తూనే ఉన్నారు. నిందితులు కోర్టుకు హాజరు కావడానికి కూడా సిద్ధంగా లేరు. ఈ కేసుల విషయంలో సుప్రీంకోర్టు.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
అన్ని హైకోర్టుల నుంచి వివరాలు వచ్చిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి తరహాలోనే ఆయా కేసులను కూడా ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది న్యాయవర్గాల అంచనా.