న్యాయవ్యవస్థను బెదిరించడానికే… తన కేసుల్లో వ్యతిరేక తీర్పులు చెప్పకుండా బ్లాక్మెయిల్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సీజేఐకి కొంత మంది న్యాయమూర్తులపై ఆరోపణలు చేసి.. లేఖ రాసి…దాన్ని మీడియాకు విడుదల చేశారని న్యాయవాదుల సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఆలిండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లు తమ స్పందన వ్యక్తం చేశాయి. జగన్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ చీఫ్జస్టిస్కు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి.. దాన్ని మీడియాకు విడుదల చేయడం వెనుక కుట్ర ఉందని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని… జగన్పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని ఆలిండియా బార్ అసోసియేషన్ కోరింది.
న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసేలా జగన్ చర్యలు ఉన్నాయని… తన కేసుల్లో కోర్టుల చర్యలను నిలువరించేందుకే.. జగన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆలిండియా బార్ అసోసియేషన్ విమర్శించింది. రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన ముఖ్యమంత్రి.. జడ్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్పై అవినీతి, మనీలాండరింగ్ కేసులు పెండింగ్లో ఉన్నాయిని … ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసులను ఎన్వీ రమణ విచారిస్తున్న సమయంలో.. జగన్ లేఖ రాయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్వీ రమణ కుటుంబ సభ్యులపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదును ఖండిస్తున్నామని ఆలిండియా బార్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తీరును ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.
జగన్ సీజేకు రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం అసంబద్ధమని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. న్యాయసూత్రాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని .. న్యాయవ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణకు, స్వతంత్రతకు.. జగన్ తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న జగన్.. ఇటువంటి చర్యలు చేయడం హేయమని నిరసన వ్యక్తం చేసింది. జగన్పై చర్యలుతీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.