ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఏబికే ప్రసాద్ అనే వ్యక్తి వేసిన ప్రజాహిత పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు అటువంటి పిటిషన్ వేసినందుకు చివాట్లుపెట్టి కొట్టివేసింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా, అసలు రాజధాని నిర్మాణమే ఇంకా మొదలవనప్పుడు దానిలో అక్రమాలు జరుగుతున్నాయని ఏవిధంగా చెపుతున్నారని ప్రశ్నించింది. దానికి మీవద్ద బలమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తే పిటిషనర్ తరపు న్యాయవాది సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. రాజధాని భూసేకరణలో పిటిషనర్ తన భూమిని ఏమైనా కోల్పోయారా? అంటే లేదని సమాధానం చెప్పడంతో, రాజధానితో సంబంధం లేని వారే మా దగ్గరికి వస్తున్నారు తప్ప భూములిచ్చిన రైతులు ఎవరూ రావడం లేదని, ప్రజాహిత వాజ్యం పేరుతో రాజధాని నిర్మాణానికి అడ్డుతగలడం మంచి పద్ధతి కాదని చెపుతూ కేసుని కొట్టివేశారు.
సాధారణంగా రాజకీయ పార్టీలు కొన్ని కారణాల చేత తాము స్వయంగా న్యాయపోరాటం చేయకూడదనుకొన్నప్పుడు ఈవిధంగా కూడా ఎవరో ఒకరి చేత పిటిషన్లు వేయిస్తుంటాయి. న్యాయస్థానాలలో పిటిషన్ ముందుకు వెళ్లి, ప్రభుత్వాలకి లేదా తమ రాజకీయ ప్రత్యర్దులకి నోటీసులు జారీ చేసి వాటిని నిలదీస్తే, అప్పుడు పిటిషన్ వేయించిన రాజకీయ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని లేదా తమ రాజకీయ ప్రత్యర్ధిని నిలదీస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఒకవేళ ఇటువంటి అవమానకర పరిస్థితులు ఎదురైనా వాటికీ ఏ ఇబ్బంది ఉండదు. ఎవరూ వాటిని వేలెత్తి చూపించలేరు. పిటిషనర్ వాదన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనలనే ప్రతిబింబిస్తున్నందున అది వైకాపా పనే అని అనుమానించవలసి వస్తోంది.