గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వాలు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది . రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తుది తీర్పు ఇచ్చింది. సొసైటీలు ప్రభుత్వాలకు డబ్బులు చెల్లించి ఉంటే.. ఆ డబ్బులన్నీ ఆయా సొసైటీలకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సొసైటీల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ అనే కాలపరిమితి ఉందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సొసైటీలకు భూముల కేటాయింపు అనేది చాలా కాలంగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా సొసైటీల కింద స్థలాలు కేటాయిస్తూ వస్తున్నారు. జూబ్లిహిల్స్ లో కూడా జర్నలిస్టులు, ఐఏఎస్ అధికారుల సొసైటీలకు స్థలాలు కేటాయించారు. ఇటీవల కూడా రేవంత్ రెడ్డి ఓ జర్నలిస్టు సొసైటీకి సుదీర్ఘ వివాదాల అనంతరం సమస్య పరిష్కరించి ల్యాండ్ వారికి అప్పగించారు. ఎన్జీవోలు గచ్చిబౌలిలో చాలా పెద్ద కాలనీనే సొసైటీ పేరుతో కట్టుకున్నారు.
ఇప్పుడీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సొసైటీల పేరుతో స్థలాలు తీసుకుని ఇళ్లు కట్టుకున్న వారికి గడ్డు ప రిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. తుది తీర్పులో ఏయే సొసైటీలు… కాలపరిమితి ఉందా అన్న దానిపై క్లారిటీ వస్తే వీరికి టెన్షన్ తీరుతుంది. మొత్తంగా ఇటీవల జర్నలిస్టులు అందరూ సమస్య పరిష్కారం అయిందని సంబరాలు చేసుకున్న స్థలం విషయం మొదటికి వచ్చినట్లయింది.