సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే మైనర్‌పై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగి కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా అని ఆయన అడిగారు. ఆయన తాను సిద్ధంగా లేనని చెప్పారు. అయినప్పటికీ.. నాలుగు వారాల పాటు అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఇప్పుడీ తీర్పు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి మోహిత్ సుభాష్ చవాన్.. ఓ మైనర్‌పై అత్యాచారం చేశాడు. పోలీసులు అతనిపై పోక్సో కేసు పెట్టారు. అప్పట్లో కేసును రాజీ చేసుకునేందుకు చవాన్ తల్లి.. మైనర్ తల్లిదండ్రులతో ఓ ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటే… బాలిక మేజర్ అయిన తర్వాత చవాన్ పెళ్లి చేసుకుంటాడని ఆ ఒప్పందం సారాశం. అయితే.. ఈ ఒప్పందాన్ని బాలిక అంగీకరించలేదు. ఇవన్నీ కోర్టు రికార్డుల్లో ఉన్నాయి. కింది కోర్టు ఆయన అరెస్ట్ పై స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కోసం సదరు ప్రభుత్వ ఉద్యోగి చవాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ రికార్డులన్నింటినీ పరిశీలించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. మళ్లీ అదే ప్రశ్న వేసింది. ఇప్పుడు మైనార్టీ తీరింది కదా ఆ బాలికను పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించారు. అయితే ఆ ఉద్యోగి మాత్రం.. ముందుగా తాను ఆఫర్ ఇచ్చినప్పుడు ఆమె ఒప్పుకోలేదని.. ఇప్పుడు తనకు పెళ్లయిందని.. తాను ఆ బాలికను పెళ్లి చేసుకోలేనని చెప్పేశారు. తాము పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదని.. కూడా వ్యాఖ్యానించారు. తర్వాత నాలుగు వారాల పాటు చవాన్ అరెస్ట్‌పై స్టే విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
పోక్సో చట్టం అత్యంత కఠినమైనది. చిన్నారులపై లైంగిక వేధింపులు.. అత్యాచారాల నిరోధకానికి కఠిన శిక్షలతో చట్టం చేశారు. మైనర్‌గా ఉన్న బాలికను రేప్ చేసిన వారిని శిక్షించాల్సిన న్యాయస్థానం ఇప్పుడు మైనార్టీ తీరిపోయింది కదా పెళ్లి చేసుకుంటారా అని ఆఫర్ ఇవ్వడం విమర్శలకు కారణం అవుతోంది. కొద్ది రోజుల కిందట.. అత్యాచారాల విషయంలో ముంబై హైకోర్టు మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో చర్చకు పెడుతున్నారు.