భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆర్థిక స్వేచ్ఛను సుప్రీం కోర్టు కత్తిరించేసింది. ఇష్టారీతిన డబ్బులు ఖర్చు చేయకుండా అంకుశం విధించింది. కొత్త కాంట్రాక్టు విషయంలోనూ పరిమితికి మించి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ పరిమితిని లోధా కమిటీ నిర్ణయించాలని సూచించింది. స్వతంత్ర ఆడిటర్ ను నియమించి బోర్డు లెక్కలన్నీ తనిఖీ చేయించాలని కూడా ఆదేశించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయని రాష్ట్ర సంఘాలకు ఒక్క పైసా కూడా విడుదల చేయవద్దని బీసీసీఐని కోర్టు విస్పష్టంగా ఆదేశించింది. బీసీసీఐ పెద్దలకు మింగుడు పడని ఈ పరిణామాలు శుక్రవారం చోటు చేసుకున్నాయి.
భారతీయ క్రికెట్ లో సమూల సంస్కరణలకు సుప్రీం కోర్టు నియమిత లోధా కమిటీ అనేక సిఫార్సులు చేసింది. వాటిని అమలు చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. బీసీసీఐ పెద్దలు మాత్రం ఆ సిఫార్సులు మరీ కఠినంగా ఉన్నాయంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు.దీంతోసుప్రీం కోర్టు అనేక సార్లు వారికి తలంటింది. ఇక శుక్రవారం నాడు కఠిన నిర్ణయాలను ప్రకటించింది.
వేల కోట్ల నిధులున్న బీసీసీఐలో ఏ డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారనే దానిపై పలు అనుమానాలున్నాయి. కొందరు బోర్డు పెద్దలు ఇష్టారాజ్యంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. బోర్డును కనీసం సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడానికి ఒప్పుకోవడం లేదంటే ఏదో మతలబు ఉందని సందేహం కలగడం సహజం. భారీ మొత్తానికి జవాబుదారీ కావాల్సిన బోర్డులో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనంత రహస్యం ఎందుకో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో నిజాలు బయటకు రాబోతున్నాయి.
లోధా కమిటీ నియమించే స్వతంత్ర ఆడిటర్ ఆ బోర్డు లెక్కలను పక్కాగా తనిఖీ చేయనున్నారు. బహుశా బీసీసీఐ చరిత్రలో మొదటిసారిగా, మొత్తం లెక్కల ఆడిటింగ్ స్వతంత్రంగా, నిష్పక్ష పాతంగా జరగబోతోంది. ఇంత కాలం ఏయే వ్యవహారాల్లో ఎంత ఖర్చు చేశారు, ఎంత దుర్వినియోగం చేశారనే వాస్తవాలు బయటకు రాబోతున్నాయి.