సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్ని తేల్చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. తన సస్పెన్షన్ అక్రమం అని.. ఏడాది నుంచి సస్పెన్షన్లోనే అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంచారని ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వాయిదాలు కోరుతూ వస్తోంది. ఇప్పుడు… ఈ అంశంపై అటో ఇటో తేల్చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై శాఖపరమైన దర్యాప్తు సాగుతోందని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ఆ అభియోగాలు నిజమో కాదో.. ఏడాది అయినా ఇంత వరకూ నివేదిక సమర్పించలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఎప్పటిలోగా విచారణ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న అభియోగాల విచారణకు 6 నెలల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అన్ని డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నప్పుడు.. విచారణకు అంత సమయం ఎందుకని ప్రశ్నించిన ధర్మాసనం.. రోజు వారీ విచారణ చేపట్టి ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కేసు విచారణ మే 3వతేదీకి వాయిదా వేసింది. వెంకటేశ్వర్రావుకి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు చాలా కాలం పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత దేశద్రోహం సహా చాలా రకాల ఆరోపణలు చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు.
ఏడాది అవుతున్నా చేసిన ఆరోపణలపై చార్జిషీట్ దాఖలు చేయలేదు. హైకోర్టు మధ్యలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది. దీనిపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. మే మూడో తేదీలోపు ఏ కారణాలతో సస్పెన్షన్ వేటు వేశారో.. వాటిలో ఉన్న వాస్తవాల్ని సుప్రీంకోర్టు ముందు పెట్టాల్సి ఉంది. లేకపోతే.. ప్రభుత్వం పెద్దలు.. సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్న అధికారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.