పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ సర్కార్ తీరు సుప్రీంకోర్టును కూడా అసహనానికి గురి చేస్తోంది. రద్దు చేస్తామో.. నిర్వహిస్తామో.. చెప్పడానికి తటపటాయిస్తోంది. దీంతో.. గురువారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. పరీక్షలకు వెళ్లాలనుకుంటే పూర్తి వివరాలను అఫిడవిట్లో తెలపాలని.. పరిక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా.. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారని.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణలో పరీక్షలను రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు నోటీసులపై… ఇతర రాష్ట్రాలు స్పందించాయి. పరీక్షల రద్దుకు సిద్ధంగా ఉన్నట్టు అసోం, పంజాబ్, త్రిపుర బోర్డులు సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఇప్పటి వరకు పరీక్షలను 21 రాష్ట్రాలు రద్దు చేశాయి. కేరళ మాత్రం పదకొండో తరగతి పరీక్షలను రద్దు చేయలేదు. ఇప్పుడు ఉన్న పళంగా ఆ పరీక్షలను నిర్వహించకపోయినా ఇబ్బంది లేదు కాబట్టి… సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి విషయం చెప్పలేదు. దీంతో సుప్రీంకోర్టు గురువారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అన్ని రాష్టాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఏపీకి ఎందుకు అనిశ్చితని ధర్మాసనం ప్రశ్నించింది. నిజానికి ఈ అనిశ్చితి ప్రభుత్వంలోనే ఉంది. విద్యా మంత్రి సురేష్ ఎప్పుడు ఏం ప్రకటనలు చేస్తూంటారో ఆయనకే తెలియదు. ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థులు టెన్షన్‌కు గురవుతున్నారు. కొత్త విద్యా సంవత్సరంపై అస్పష్టత ఏర్పడింది. పరీక్షలు రద్దు చేస్తారా.. నిర్వహిస్తారా అన్నదానిపై.. ఓ రకంగా ఏపీ సర్కార్‌కు గురువారం డెడ్ లైన్ అనుకోవచ్చు. ఆ రోజు ప్రభుత్వం తేల్చేసే అవకాశం ఉంది.