కోవిడ్ మృతుల కుటుంబాలకు రిలీఫ్ కలిగించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. వారి కుటుంబాలకు సాయం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆరు వారాల్లోగా ఎంత సాయం చేస్తారు..? ఎలా చేస్తారు.. లాంటి విధివిధానాలను ఖరారు చేసి సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కరోనా మృతుల కుటుంబాల్లో భవిష్యత్‌పై కాస్తంత ఆశ కనిపించే అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది వరకూ చనిపోయారు. అనధికారికంగా కోవిడ్ ఖాతాలో కాకుండా… సహజ మరణాల ఖాతాలో వేసిన మరణాలు మరికొన్ని లక్షలు ఉంటాయని చెబుతున్నారు.
వీరి కుటుంబాలనుఆదుకోవాలని సుప్రీంకోర్టులో కొంత మంది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో.. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షలు ఇవ్వాలని సూచన చేసింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షలు ఇచ్చేందుకు డబ్బుల్లేవని తేల్చేసింది. ఒక వేళ విపత్తు సహాయ నిధి కింద ఉన్న మొత్తాన్ని వారికి ఇచ్చినట్లయితే.. ఇక తర్వాత ఏ విపత్తు వచ్చినా ఆదుకునేందుకు నిధులు ఉండవని చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ వాదన విన్న సుప్రీంకోర్టు… కోవిడ్ మృతుల బాధితుల్ని ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే రూ. నాలుగు లక్షలు కాకుండా.. కేంద్రమే ఎంత ఇస్తుంది.. ఎలా ఇస్తుందో చెప్పాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రాలకూ ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలపై ఇప్పటికే ఒత్తిడి ఉంది. సుప్రీంకోర్టు పుణ్యమా అని… కేంద్రమే.. సాయం చేయనుంది. కేంద్ర సాయానికి రాష్ట్రం ఎంతో కొంత జమ చేస్తే.. కరోనా దెబ్బకు కకావికలం అయి న కుటుంబాలు.. కాస్త నిలదొక్కుకునే అవకాశం ఉంది.