సీబీఐ విషయంలో సుప్రీంకోర్టుకు ఓ ధర్మసందేహం వచ్చింది. సీబీఐ అధికారులు జమ్మూకశ్మీర్లోని ఇద్దరు లాయర్లపై నమోదు చేసిన కేసులో వారి వాదనలు విన్న జస్టిస్
ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు వేయించగలుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. ఇప్పటివరకు సీబీఐ ఎన్ని కేసులు చేపట్టింది?, ఎన్ని నిరూపించింది?, ఎందరికి శిక్ష పడింది?, ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో చెప్పాలని ఆదేశించింది. ఆరు వారాల్లో సీబీఐ డైరక్టర్ ఈ వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
అలాగే సిబ్బంది, మౌలిక వసతుల లేమి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. రెండు వారాల కిందట మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కూడా సీబీఐ విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీబీఐని రాజకీయ పంజరం నుంచి వదిలి పెట్టాలని .. సీబీఐని పటిష్ట పరిచేందుకు మొత్తం 12 సూచనలను ధర్మాసనం చేసింది. కాగ్, ఎన్నికల కమిషన్ తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి సీబీఐకి కల్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది అదే తరహాలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీబీఐ పనితీరుపై సమీక్ష ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది.
సీబీఐ నమోదు చేస్తున్న కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. కేసులు నమోదు చేస్తారు.. విచారణ చేస్తారు కానీ తర్వాత అవి ఏమవుతాయో ఎవరికీ తెలియదు. అలాంటి కేసులు వేలల్లో ఉంటాయన్న ప్రచారం ఉంది. కానీ వివరాలేమీ బయటకు రావు. ఇరవై ఏళ్ల కిందటి సీబీఐ కేసులూ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అవసరమైనప్పుడు మాత్రం ఆ కేసులు బయటకు వస్తూంటాయన్న విమర్శలు మాత్రం ఉన్నాయి.