“ప్రధాని మోడీ , అమిత్ షాలు అదే పనిగా ప్రచారంలో సైన్యం, బాలాకోట్ దాడులు, పాకిస్థాన్ అంశాలను వాడుకుంటున్నారు. ఇది కచ్చితంగా కోడ్ ఉల్లంఘనే. చర్యలు తీసుకోవడానికి.. ఎన్నికలయ్యేవరకూ ఎదురుచూడం. పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం..!” ఇది కొద్ది రోజుల కిందట.. ఎన్నికల సంఘంలోని ఓ కీలక అధికారి జాతీయ మీడియాకు చెప్పిన మాటలు. ఇవి చెప్పి కూడా పది రోజులు దాటిపోతోంది. కానీ..మోడీ, షాలకు కనీసం నోటీసులు జారీ చేయలేదు. అయితే.. ఈ లోపు రాహుల్ సహా.. అనేక మంది విపక్ష నేతలపై.. చాలా చర్యలు తీసుకున్నారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మోడీ , షాలు ఎన్ని సార్లు కోడ్ ఉల్లంఘించినా.. ఈసీ చర్యలు తీసుకోలేదని… పిటిషన్ వేసింది. దీనిపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలోనూ.. ఈసీ అదే వాదన వినిపించింది.
తమకు మరో వారం రోజుల సమయం కావాలని..ఈసీ సుప్రీంకోర్టును కోరింది. దీంతో సుప్రీంకోర్టు ఈ నెల 6 లోపు నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. వచ్చే సోమవారమే చర్యలను తెలపాలని ఆదేశించింది. కోడ్ ఉల్లంఘనలపై.. కాంగ్రెస్ పార్టీ మొత్తం పదకొండు ఫిర్యాదులు చేసింది. మోడీ ,షాలు సైన్యాన్ని వాడుకోవడం, మైనార్టీ వర్గాలనుద్దేశించి వ్యాఖ్యలు చేయడం సహా.. అనేక ఉల్లంఘన ఫిర్యాదులు వాటిలో ఉన్నాయి. అయితే.. మొదటి సారి… చేసిన రెండు ఫిర్యాదులపై మాత్రం..పరిశీలన జరిపి..జరిపి… రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. వాటిలో మోడీ తప్పేం లేదని తేల్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మైనార్టీలు మెజార్టీగా ఉన్న చోట పోటీ చేస్తున్నారని.. వారి రక్షణలో దాక్కుంటున్నారని నేరుగా చేసిన వ్యాఖ్యలు.. ఈసీకి… మత ప్రాతిపదికగా చేసిన వ్యాఖ్యల్లా అనిపించలేదు.
దీనిపై దుమారం రేగినా ఈసీ దులిపేసుకుంది. ఇలాంటివి మరో తొమ్మిది ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై… ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలు మరో మూడు విడతలుగా జరగనున్నాయి. ఆలస్యం చేస్తే చాలన్నట్లుగా… ఈసీ ఉండటంతో… చర్యలకు.. కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇప్పటి వరకూ..కోడ్ ను.. మోడీకి అన్వయించిన తీరు చూస్తే… తమ విశేషాధికారాలతో.. క్లీన్ చిట్ ఇస్తారని… ఎవరైనా ఇట్టే ఊహిస్తారని… రాజకీయవర్గాలు చెబుతున్నాయి.