హిట్-అండ్-రన్ కేసులో దోషిగా నిర్ధారింపబడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి దిగువ కోర్టు విధించిన ఐదేళ్ళ జైలు శిక్షని సరయిన సాక్ష్యాధారాలు లేని కారణంగా బాంబే హైకోర్టు ఈ ఏడాది మే 8వ తేదీన రద్దు చేసి బెయిలు మంజూరు చేసింది. సుశీల భాయ్ హిమ్మత్ రావు పాటిల్ అనే వ్యక్తి తన లాయరు మనోహర్ లాల్ శర్మ ద్వారా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సల్మాన్ ఖాన్ కి హైకోర్టు మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలని, అలాగే సల్మాన్ ఖాన్ అంగ రక్షకుడుగా పనిచేసిన రవీంద్ర పాటిల్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తుకు ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషను నేడు విచారించిన జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. ఖలిఫుల్లా మరియు జస్టిస్ అమితావ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులో కలుగజేసుకోవలసిన అవసరం ఉందని తాము భావించడంలేదని చెపుతూ పిటిషన్ని కొట్టివేశారు.
సల్మాన్ ఖాన్ ఉద్దేశ్యపూర్వకంగా చేయకపోయినా, అతని వలన నేరం జరిగిందని అందరికీ తెలుసు. మొదట తను నేరం చేయలేదని వాదించాడు. తరువాత తన కారును డ్రైవర్ నడిపాడని వాదించాడు. అతని నేరం రుజువయి కోర్టు అతనికి ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారు చేస్తునప్పుడు, తను చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని శిక్షను రద్దు చేయమని కోర్టును అభ్యర్ధించాడు. అంటే చివరికి తను నేరం చేసినట్లు అంగీకరిచాడని అర్ధం అవుతోంది. కానీ ఇక జైలుకి వెళ్ళడమే తరువాయి అనుకొంటున్న సమయంలో బోంబే హైకోర్టు అతని జైలు శిక్షని రద్దు చేసి బెయిలు మంజూరు చేసింది. బాంబే హైకోర్టు తీర్పుపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, విమర్శలు వెలువెత్తాయి. కనీసం అతనికి భారీ జరిమాన విధించి అతని కారు క్రింద పది అంగ వైకల్యం పొందిన వ్యక్తికి, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇప్పించలేకపోవడంతో నిరసనలు వెలువెత్తాయి. సరిగ్గా అదే సమయంలో, అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించబడి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించబడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పడంతో దేశ వ్యాప్తంగా న్యాయవ్యవస్థల తీర్పులపై విమర్శలు వెలువెత్తాయి. మన న్యాయవ్యవస్థలు పేదవారికి ఒక న్యాయం, డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్నవారికి మరొక రకమయిన న్యాయం అమలు చేస్తున్నారని సామాన్య ప్రజలు సైతం భావించారు. నేరం రుజువయి శిక్షలు ఖరారు అయిన జయలలిత మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి అవగా, సల్మాన్ ఖాన్ యధాప్రకారం సినిమాలలో గొప్ప లక్షణాలున్న హీరో వేషాలు వేసుకొంటూ రెండు చేతులా డబ్బు సంపాదించుకొంటున్నారు.