హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి ఇటీవల పలు విషయాలలో హైకోర్ట్‌లో చుక్కెదురు కావటం, ఆంధ్రా న్యాయమూర్తులు ఎక్కువమంది ఉండటంవల్లే ఇలా జరుగుతోందని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయటం తెలిసిందే. తాజాగా దేశ అత్యన్నత న్యాయస్థానంలోకూడా కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురయింది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని 138 బీసీ ఉపకులాలలోని కాళింగ, తూర్పుకాపు, గవర, శెట్టి బలిజ వంటి 26 సామాజికవర్గాలు తెలంగాణలో ఉనికి లేవంటూ వాటికి రిజర్వేషన్లు తొలగిస్తూ గత ఏడాది ఆగస్ట్, ఈ ఏడాది మార్చిలో జారీచేసిన ఉత్తర్వులపై కేసీఆర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్ట్ తప్పుబట్టింది. బీసీ ఉపకులాలకు రిజర్వేషన్లు తొలగించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించింది. అవసరమైతే కమిషన్ వేసుకోవాలని సూచించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఉమ్మడి హైకోర్ట్‌లో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు, జస్టిస్ శివకీర్తిసింగ్, జస్టిస్ అమితమరాయ్లతో కూడిన ధర్మాసనం నిన్న విచారించింది. ఉమ్మడి హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
మెడికల్ కౌన్సెలింగ్‌లో తమ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పించలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కళింగ సామాజికవర్గానికి చెందిన వెన్నెల, రాణి, హిమజ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, కళింగ సామాజికవర్గానికి చెందినవారు వెనకబడిన వర్గాలలోకి రారని అనంతరామన్ కమిషన్ పేర్కొందని, వారు తెలంగాణలో ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చుగానీ రిజర్వేషన్లు కోరరాదని తెలిపారు. రోహత్గి వాదనలతో విభేదించిన ధర్మాసనం, విభజనవల్ల కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రానికి వెళ్ళినంత మాత్రాన రిజర్వేషన్లు చెల్లవనటం సమంజసం కాదని అభిప్రాయపడింది.
ఈ రిజర్వేషన్ల తొలగింపుపై గతంలో కొందరు ఉమ్మడిహైకోర్టును ఆశ్రయించగా రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు వెలువడింది. అయితే ఈ తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీనిపైనే ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే విధించింది.
హైకోర్ట్‌లో తీర్పులు వ్యతిరేకంగా రావటానికి కారణం ఆంధ్రా న్యాయమూర్తులు కారణమన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడేమంటారో చూడాలి. అన్నట్లు, సుప్రీమ్ కోర్ట్‌లో కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కెదురుకావటం ఇదే మొదటిసారికాదు. ఎమ్సెట్ విషయంలోకూడా అత్యున్నత న్యాయస్థానం కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా అభిశంసించింది.