కోర్టుల విషయంలో తమకు ఏదనిపిస్తే అది చేసే ఏపీ ప్రభుత్వానికి జీవో నెంబర్ 1 విషయంలోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. ఇరవై మూడో తేదీ వరకూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చి 20వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశిస్తే…. ఆ కౌంటర్ దాఖలు చేయకుండా నేరుగా సుప్రీంకోర్టుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని.. హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి అక్కడే తేల్చుకోవాలన్నారు. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 23వ తేదీన ఏపీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. అక్కడ ప్రభుత్వం అనుకున్న విధంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు.
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ల పైన సభలు – ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ విచారణ సమయంలో కీలక వాదనలు జరిగాయి. పిల్ ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో నెంబర్ 1 ను ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
ఈ జీవో ఇచ్చిన తర్వాత పూర్తిగా విపక్షాలను అడ్డుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసింది. వేల మంది పోలీసులను ప్రయోగించి.. చంద్రబాబు పర్యటనలను అడ్డుకున్నారు. త్వరలో లోకేష్, పవన్ యాత్రలు చేయబోతున్నారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి కోసం లేఖ పంపినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జీవో నెంబర్ వన్ పై హైకోర్టులో అనుకూల తీర్పు తీసుకు వస్తే ప్రతిపక్ష నేతల్ని రోడ్డు ఎక్కకుండా చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు.