మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న మేఘాకృష్ణారెడ్డికి పరిస్థితిలు కలిసి రావడం లేదు. గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు డైరక్టర్ల మధ్య గొడవలు పెట్టడం వరకూ వచ్చి ఆగిపోయాయి. ఆస్పత్రి అమ్మకానికి వ్యతిరేకంగా ఎక్కువ మంది డైరక్టర్లు నిలబడటంతో మేఘా కృష్ణారెడ్డి ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఆ వివాదం సమయంలో ఆస్పత్రి వ్యవహారాలను పర్వవేక్షించడానికి అబ్జర్వర్ను నియమించారు. ఈ అబ్జర్వర్ ఉంటే తమ ప్రయత్నాలు ఫలించవని మేఘా కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్పుడు సుప్రీం నిర్ణయంతో స్పెషల్ ఆఫీసర్ కంటిన్యూ కానున్నారు. ప్రస్తుతం ఎన్నారై ఆస్పత్రిలో డైరక్టర్ల మధ్య వివాదంలో ఆర్బిట్రేషన్ కొనసాగుతోంది. దీన్ని కొనసాగనివ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎన్నారై ఆస్పత్రిని రూ. 630 కోట్లకు కొనాలని గతంలోనే మేఘా కృష్ణారెడ్డి ప్రయత్నించారు. ఈ విషయాన్ని డైరక్టర్లే ప్రకటించారు. మెజార్టీ డైరక్టర్లు ఆస్పత్రి అమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నారు. అంతపెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేసి.. పేదలకు ఎలా తక్కువ ధరకు వైద్యం అందిస్తారని వారు ప్రశ్నించారు. అయితే కొంత మంది డైరక్టర్లు మాత్రం … అమ్మకానికే మొగ్గు చూపారు. ఈ వివాదం కారణంగా ఎన్నారై ఆస్పత్రి యాజమాన్యం గందరగోళంలో పడింది. చివరికి అబ్జర్వర్ ను నియమించడంతో సజావుగా సాగుతోంది.
ఇటీవల ఈడీ కూడా ఎన్నారై ఆస్పత్రిలో సోదాలు నిర్వహించింది. అక్రమ నగదు చెలామణిని గుర్తించామని ఈడీ ప్రకటించింది. కొన్ని ఆస్తులు జప్తు చేసినట్లుగా తెలిపింది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట చాలా మంది ఎన్నారైలు.. పేదలకు మెరుగైన వైద్యం, వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్నారై ఆస్పత్రి మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆ యాజమాన్య మధ్య గొడవలు ప్రారంభం కావడంతో.. మధ్యలో మేఘా కృష్ణారెడ్డి దాన్ని కైసరం చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.