ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజక్టుల నిర్మాణంలో ఎన్జీటీ సంయుక్త కమిటి విధించిన నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఏపీ సర్కార్ను ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. నష్టపరిహారం చెల్లించకుండా పెద్ద ఎత్తున సీనియర్ లాయర్లను పెట్టుకుని ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది. గత విచారణలో ఈ అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అసలు ఎన్జీటీ విధించిన జరిమానా కన్నా ఎక్కువగా లాయర్ల ఫీజులకు చెల్లిస్తున్నారన్న సందేహం వ్యక్తం చేసింది.
ఈ విచారణలో నష్టపరిహారం ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పులోని ఇతర అంశాలను పూర్తిగా అమలు చేయాలని.. నష్టపరిహారం అంశం మాత్రం విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ముందుగా పరిహారం మాత్రం జమ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో పర్యవరణ ఉల్లంఘనలు ఉన్నాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ జరిమానా విధించడంతో పాటు కీలక ఆదేశాల ఇచ్చింది.
ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది. సీనియర్ లాయర్లకు పెద్ద ఎత్తున ఫీజులు చెల్లిస్తూ… లాయర్లను నియమించుకుంటున్నారు. అయితే ఆ కేసులేవీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం లేదు. ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం లాయర్లకు ఫీజులివ్వడానికే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.