సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి అనుకూల తీర్పు రాలేదు. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయ విస్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించబోమని.. వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని తేల్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకునేది లేదని తేల్చేసింది.
ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని .. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయం పడింది. రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఉద్యోగులను ప్రశ్నిచింది. ఉద్యోగులు పని చేయకుండా పిటిషన్ వేయడం ప్రమాదకరమని.. సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ సమావేశానికి ఉద్యోగులు ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరి చూపు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై పడింది.
సుప్రీంకోర్టు ఆదేశించినా తాము ఎన్నికల్లో పాల్గొనబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇప్పటికే ఎస్ఈసీని ఉద్యోగులు ధిక్కరించారు. సీఎస్ నుంచి కింది స్థాయి ఆర్వో వరకూ ఎవరూ ఎన్నికల విధులు చేపట్టలేదు. ఇప్పుడు.. ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తీర్పు అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి ప్రకటించి… తమ ఉద్దేశాలను చెప్పకనే చెప్పారు.