రుషికొండలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం … ఎన్జీటీ ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకెళ్లిపోరాడి అనుకున్నది సాధించింది. సుప్రీంకోర్టు కొత్తగా ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని స్పష్టం చేసినా… నిర్మాణాలను అనుమతి ఇచ్చింది. ఆ నిర్మాణాలు కేవలం గతంలో ఉన్న హరిత రిసార్టును కూల్చివేసిన ప్రాంతంలోనే నిర్మించాలని కొత్త ప్రాంతంలో వద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం అసలు కొండే లేదు. పూర్తిగా తొలిచేశారు.
హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున అక్కడే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పాత రిసార్టు ఉన్న ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా ఎలాంటి తవ్వకాలు వద్దని చెప్పడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయినట్లేనని భావిస్తున్నారు. హైకోర్టులో తేలే వరకూ ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది.
రిషికొండ సమీపంలో ప్రభుత్వానికి చెందిన హరితా రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు ఈ రిసార్ట్స్ వసతి సౌకర్యం కల్పించేవి. అయితే అకస్మాత్తుగా వాటిని కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెద్ద స్థాయి టూరిజం హోటల్ కడతామని రిషికొండను తవ్వేస్తున్నారు. అయితే ఆ మాట అధికారికంగా చెప్పడం లేదు. మరోవైపు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం కోసం అని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు కూల్చేసిన రిసార్టుల ప్లేస్లో మాత్రమే కట్టుకోవడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇది చాలు అనుకుని మొత్తం పనులు చేస్తారో … లేకపోతే.. అక్కడే గాల్లో నిర్మాణాలు చేస్తారో చూడాలి.