ఎస్సీ వర్గీకరణ అంశం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ఎన్నో పోరాటాలు జరిగాయి. కొంత మంది వ్యతిరేకిస్తే, ఇంకొందరు సమర్థించారు. ఎస్సీల్లో ఉన్న ఉప కులాల ఆధారంగా రిజర్వేషన్లు కావాలంటూ జరుగుతున్న ఉద్యమం తుది అంకానికి చేరింది.
విద్యా, ఉద్యోగ-ఉపాధి అంశాల్లో ఎస్సీ, ఎస్టీల్లో ఉప కులాల ఆధారంగా వర్గీకరిస్తూ, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మినహా మిగిలిన ఆరుగురు అనుకూలంగా తీర్పునిచ్చారు.
2004వ సంవత్సరం వరకు ఉప కులాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు అమలయ్యాయి. ఆ తర్వాత మాల మహానాడు హైకోర్టుకు వెళ్లటం కోర్టు స్టే ఇవ్వటంతో ఉపకులాల ఆధారంగా రిజర్వేషన్ల అంశం ఆగిపోయింది. దీనిపై గతంలోనే సుప్రీంకోర్టు దీనిపై విచారిస్తూ… వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేవని, కేంద్రం చట్టం చేస్తే, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే అమలవుతాయని తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎస్సీ-ఎస్టీ వర్గీకరణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి.
మందకృష్ణ మాదిగతో పాటు పలువురు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ రాగా… ఎన్నికలకు ముందు బీజేపీ కూడా మద్దతు పలికింది. ప్రధాని మోడీ స్వయంగా వచ్చి వర్గీకరణకు సానుకూల ప్రకటన చేశారు.
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం… ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న ఉప కులాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది.