ధ్రిల్లర్ ఎపిసోడ్లా సాగుతున్న బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ ఆత్మహత్య ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి బీహార్ ప్రభుత్వం సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ కేసులో విచారణకు సీబీఐ బృందాలను రంగంలోకి దింపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ కూడా చేస్తున్నారు. అయితే.. దీన్ని వ్యతిరేకిస్తూ… ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… ఈ కేసులో ఎన్నో అనుమానాలున్నందున సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించింది. రియా పిటిషన్ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.
మహారాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకూ సేకరించన ఆధారాలను.. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే.. తమ రాష్ట్రంలో జరిగిన దానికి బీహార్ ప్రభుత్వం కల్పించుకోవడం ఏమిటని.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. సీబీఐ దర్యాప్తును వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టునే ఆదేశించడంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో దారి లేకుండా పోయింది. సీబీఐ దర్యాప్తును స్వాగతించక తప్పడంలేదు. సుషాంత్ ఆత్మహత్య కేసు పేరుతో తమ ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని.. శివసేన నేతలు.. కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు.
జూన్ పధ్నాలుగో తేదీన సుషాంత్ సింగ్.. తన ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తేలింది. అప్పట్నుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతోంది. మొదట నెపోటిజం పేరుతో టాలీవుడ్ పెద్దలపై విమర్శలు చేశారు. తర్వాత సుషాంత్ లవర్ రియా చక్రవర్తిపై ఆరోపణలు ప్రారంభమయ్యాయి. రోజుకు ఓ కొత్త విషయం.. ఈ కేసులో వెలుగు చూస్తూండటంతో.. కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.