కరోనా మృతుల కుటుంబాలకు రూ. యాభై వేల ఆర్థిక సాయం చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించింది. ఏపీకి అలా రూ. పదకొండు వందల కోట్లు కేటాయించింది. ఇవన్నీ విపత్తు నిధులు. కానీ ఆ నిధులన్నింటినీ ఏపీ ప్రభుత్వం దారి మళ్లించేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం తీరుపై మండి పడింది.
కరోనా ఆర్థిక సాయం ప్రజలకు అందకుండా దారి మళ్లించారని ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సాయం నిధులను పక్కదారి పట్టించడమేమిటని నిలదీసింది. దీనిపై సమగ్ర వివరాలతో మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతులకు ఇవ్వాల్సిన నిధులను పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్లించడం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో పాటు అప్రాప్రియేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
విపత్తు నిధుల దారిమళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కోర్టు ఉదహరించింది. ఇప్పటికే పీడీ ఖాతాల్లోకి తరలించిన నిధులను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వినియోగించవద్దని పేర్కొంది. కొవిడ్ బాధితులకు నష్టపరిహారంపై ఇప్పటికే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ కూడా జరిపింది. అందులో ఎన్ని అక్రమాలు జరిగాయో కేంద్రం బయట పెట్టాల్సి ఉంది.