పెగాసస్ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విచారణ జరిపించాలని పాత్రికేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ .. పెగసస్ స్పైవేర్‌తో నిఘా మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడిగా పేర్కొన్నారు. ఇది రోగ్ సాఫ్ట్వేర్ అని.. దీన్ని ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్వో కేవలం ప్రభుత్వాలకే మాత్రమే అమ్ముతుందని.. ఇండియాలో ఎవరికి అమ్మారో తేలాల్సి ఉందన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని.. కోరారు.
పిటిషనర్ తరపు లాయర్ వాదనలు విన్న ధర్మాసనం.. గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని వ్యాఖ్యానించింది. గూఢచర్యం, నిఘా జరుగుతున్న తున్నట్లు 2019లో ఆరోపణలు వచ్చాయని.. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా కృషి జరుగుతోందో, లేదో తనకు తెలియదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన ఏమిటో తెలుసుకోకుండా.. నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. అప్పుడు విచారణకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడాహాజరు కావాలని ఆదేశించారు.
పెగాసస్ నిఘా వ్యవహారం బయటపడిన తర్వాత రాజకీయ దుమారం రేగింది. విచారణ కోసం విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు కూడా అదే కోరుతున్నాయి. పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నాయి. కానీ.. కేంద్రం మాత్రం పెగాసస్ పై మినహా.. మరి దేనిపైనైనా చర్చిద్దామని అంటోంది. అయితే.. దేశ సమగ్రతకు భంగం కలిగించే నిఘా ఎవరు పెట్టారో తేల్చాలని నిందితులకు శిక్షలు పడాలని.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. వచ్చే విచారణలో కేంద్ర విచారణకు సుముఖత వ్యక్తం చేస్తే.. సుప్రీంకోర్టు కూడా విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.