తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉండటంతో శుక్రవారం విచారణ జరగనుంది. శుక్రవారం ఉదయం 10: 30 గంటలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు.
టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై ఏపీ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిట్ ను కొనసాగించాలా? లేక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.
కాగా, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎంపీలు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ లపై జస్టిస్ గవాయి.. జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై సెప్టెంబరు 30న విచారణ జరిపిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 3కి వాయిదా వేసింది. ఓ కీలకమైన కేసు ఉన్నందున లడ్డూ వ్యవహారంపై విచారణ సాధ్యపడలేదు.
రేపు విచారణ జరగనుండటంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోననేది ఆసక్తికరంగా మారింది.