చట్టాలను చేసే వారే వాటిని పాటించక పోవడం అనే విచిత్రం మన దేశంలో తప్ప మరెక్కడా ఉండదేమో. సమాచార హక్కు చట్టం తెచ్చింది పార్లమెంటు. అంటే, ఎంపీలు. మన ప్రతినిధులు. కానీ, రాజకీయ పార్టీలకు మాత్రం ఆ చట్టం వర్తించదు. మిగతా సంస్థలు, ఆఫీసులు అన్నీ దాని పరిధిలోకి వస్తాయి. పార్టీలకు మాత్రం మినహాయింపు.
ఇది రాజకీయ పార్టీల అతితెలివి కాక మరేమిటి? అందుకే, దీనిపై సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకు రావడంపై అభిప్రాయం చెప్పాలని ఎన్నికల కమిషన్ ను కోరింది, అలాగే, పారదర్శక చట్టం పరిధిలోకి మీ పార్టీలను తీసుకు రావడంపై అభిప్రాయం తెలపాలని ఆరు జాతీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. దీనికి పార్టీల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. షరామామూలుగా, మాకు పారదర్శక, సమాచార హక్కు చట్టం బంధనాలు ఉండకూడదనే పార్టీలు వాదించే అవకాశం ఉంది.
దేశంలో ప్రతి ఒక్కు స.హ. చట్టాన్ని గౌరవించాలి. పాటించాలి. దాన్ని అమల్లోకి తెచ్చిన రాజకీయ పార్టీలు మాత్రం అందుకు అతీతం. ఎంత అతితెలివి. చట్టం చేయగానే ముందు తాము పాటించి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు మన దేశంలో చేసే విన్యాసాలు ఏమిటో అందరికీ తెలుసు. పైగా రకరకాల పద్ధతుల్లో వందల వేల కోట్ల చందాలు తీసుకునే రాజకీయ పార్టీలు, ఆ వివరాలు ఆదాయ పన్ను శాఖకు తెలపడానికి కూడా ఇష్టపడవు. కోట్లకు పడగెత్తిన పార్టీలకూ ఆదాయ పన్ను మినహాయింపు ఎందుకో అర్థం కాదు.
నెలకు పాతిక వేలు జీతం తీసుకునే వారు కూడా ఆదాయ పన్ను విధిగా చెల్లించాల్సి ఉంటుంది. పార్టీలకు మాత్రం ఎన్ని వేల కోట్ల ఫండ్స్ వచ్చినా పన్ను మినహాయింపు నిస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విరాళాలు పోగేసుకోవడం, అక్రమాలు, అవినీతి మార్గంలో ఫండ్స్ జమ చేసుకోవడం వగైరా వక్రమార్గాలు డబ్బు సంపాదించడం తమ హక్కు అన్నట్టు పార్టీలు, రాజకీయ నాయకుడు ప్రవర్తిస్తుంటారు. నీతి నిజాయితీగా లెక్కలు చూపించే వారు చాలా తక్కువ మంది. ఈ ధోరణి మారాలంటే పారదర్శకత రావాలి. సహ చట్టం ద్వారా పార్టీల వివరాలు, చందాల వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండాలి. అప్పుడే పార్టీల అసలు రంగు బయటపడుతుంది.
ఈ దిశగా సుప్రీం కోర్టు చూపిన చొరవకు స్పందన ఎలా ఉంటుందనేదే ఆసక్తికరం. వ్యవస్థలో ప్రక్షాళనకు న్యాయ వ్యవస్థ ప్రయత్నిస్తున్నా, రాజకీయ వ్యవస్థ మాత్రం ఇంకా అవినీతి బురదను వదిలేది లేదనడం మన దౌర్భాగ్యం. పారదర్శకత తప్పనిసరి అయితే తమ ఆటలు సాగవేమో అని పార్టీలు భయపడుతుంటాయి. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్నీ ఒకటే. ఇప్పటికైనా సహ చట్టం పరిధిలోకి రావడానికి పార్టీలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే, ప్రజలు హర్షిస్తారు.