చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఎన్నికల అధికారి ఫలితాన్ని మార్చేశారు. ప్రజాతీర్పును కాలరాశారు. సీసీ కెమెరాల్లో అవి బయట పడబట్టి సరిపోయింది. దీనిపై సుప్రీంకోర్టు గట్టిగానే స్పందించిది. ఆ ఓట్లన్నింటినీ మళ్లీ కోర్టు హాల్లో కౌంటింగ్ చేయించి విజేతను ప్రకటించింది. గతంలో బీజేపీ అభ్యర్థి మేయర్ అయితే… కోర్టులో జరిగిన కౌంటింగ్ లో ఆప్ అభ్యర్థి గెలిచారు. కానీ ఇక్కడ విషాదం ఏమిటంటే.. సుప్రీంకోర్టు చేసుకోవాల్సి రావడం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలని వ్యవస్థలో ఉన్న వాళ్లు ప్రయత్నిస్తూంటే.. సుప్రీంకోర్టు ఎంత కాలం కాపాడగలదు. ఇప్పటికే ఎన్నో చోట్ల ప్రజాభిప్రాయానికి.. ప్రజాతీర్పునకు సంబంధం లేని ఘటనలు చోటు చేసుకున్నాయి కూడా.
చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో మెజారిటీని తలకిందులు చేసి అధికారాన్ని కైవసం చేసుకొన్న బిజెపి అడ్డదారిని ఆధారాలతో సహా అత్యున్నత న్యాయస్థానం రుజువు చేసి ఆప్ కౌన్సిలర్‌ను మేయర్‌గా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడామని సగర్వంగా ప్రకటించింది. జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో తగినంత సంఖ్యా బలం లేకపోయినా బిజెపి మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి కావలసిన కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ మద్దతు కూడా ఉన్న ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓడిపోయారు.
ఆప్ కౌన్సిలర్లు వేసిన ఎనిమిది బ్యాలట్ పత్రాలను సరైన కారణం లేకుండా ‘చెల్లుబాటు కానివిగా’రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కానీ అవి చెల్లకుండా చేసింది ఆయనే. అడ్డగోలు రాతలు రాసి.. చెల్లనివిగా ప్రకటించారు. సుప్రీంకోర్టు విచారణలో రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలట్ పత్రాలను బెంచ్ పరిశీలించింది. ‘ఈ బ్యాలట్ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా’ అని మసీహ్‌ను బెంచ్ ప్రశ్నించింది. ‘అవి ఆప్ అభ్యర్థి పేరిట వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు’ అని సిజెఐ వెల్లడించడమే కాకుండా వాటిని కోర్టులో రెండు పక్షాల న్యాయవాదులకు చూపించారు. తీర్పు ప్రకటించారు.
నిజానికి ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది కానీ… అనేక చోట్ల జరుగుతోంది ఇదే. బలముకున్నచోట… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వ్యవస్థలు సక్రమంగా పని చేయకపోవడమే దీనికి కారణం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి బలం. అది వ్యవస్థల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతీ సారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోగలదా ?