తెలంగాణ ముందస్తు ఎన్నికలపై ఢిల్లీలో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాలుగు రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారానికి ఎన్నికల సంఘం దాదాపుగా పుల్‌స్టాప్ పెట్టింది. నాలుగు రాష్ట్రాలతో పాటు ఐదో రాష్ట్రంగా తెలంగాణకు ఎన్నికలు జరపాలని దాదాపుగా నిర్ణయించుకుది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంతో పాటే… తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సీఈసీ రావత్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన ఉమేష్ సిన్హా కమిటీ నివేదికను పరిశీలించారు. తెలంగాణలో ఎన్నికలకు అన్ని సిద్ధంగా ఉన్నాయని ఉమేష్ సిన్హా కమిటీ నివేదిక ఇచ్చింది. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షా అభ్యంతరాలను తోసిపుచ్చారు. వారం పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించిన తర్వాత ఎన్నికల తేదీలపై ఈసీ తుది కసరత్తు చేయనుంది. అక్టోబర్ రెండో వారంలో 5 రాష్ట్రాల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
మరో వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ముందస్తు వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని.. ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలు సరిదిద్దకుండా ఎన్నికలకు వెళితే ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సిద్ధిపేటకు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే 2019, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని.. ఇప్పుడా అవకాశాన్ని వారు కోల్పోతున్నారని పిటిషనర్ వాదించారు.
హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత లోపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీనిపై వారం రోజుల్లోగా ఇరు వర్గాలు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసింది.
కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై పిటిషన్ వేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని… కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈసీ తీరు చూస్తూంటే.. కేసీఆర్ తో కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్ల సవరణ గడువును కుదించడం సరికాదుని నాలుగు నెలల్లో చేయాల్సిన పని 4 వారాల్లో సాధ్యం కాదని శశిధర్ రెడ్డి చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ ముందస్తుపై ఢిల్లీలో ఒకడుగు ముందుకు..మరో అడుగు వెనక్కి పడినట్లయింది.