పన్ను మినహాయింపులు ప్రకటించినా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించలేదని ఓ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణ అందులో హీరో మాత్రమే కాబట్టి.. ఈ ఇష్యూతో సంబంధం లేదు. అయితే బాలకృష్ణ సినిమా నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం హైలెట్ అయింది. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా సంస్కృతిని తెలియచెప్పేదిలా ఉందని.. తెలుగు చరిత్రను కొత్త తరానికి తెలిపిందన్న కారణంతో పన్ను మినహాయింపు ఇచ్చారు.
సాధారణంగా ఇలాంటి సినిమాలకు పన్ను మినహాయింపులు లభిస్తూ ఉంటాయి. సామాజిక అంశాలపై తీసిన సిమాలకు ఇలాంటి ప్రయోజనాలు కల్పిస్తారు. అయితే .. ఏ సినిమా కూడా టిక్కెట్ రేట్లను తగ్గించవు. పన్నులు తగ్గించినా ఆ ప్రయోజనాలు వినియోగదారుడికి అంటే ప్రేక్షకుడికి ఎప్పుడూ బదిలీ కాలేదు. ఎవరూ తగ్గించలేదు. ఇప్పటి వరకూ ఎవరూ ప్రశ్నించలేదు కూడా. కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి వాదన తెరపైకి వచ్చింది. పన్ను మినహాయింపులు వల్ల లభించే ప్రయోజనం .. నిర్మాతలు తీసుకుంటున్నారని.. కానీ పన్ను ప్రజలపై భారం వేయకుండా ఉండాలనేది నిబంధన అని వాదిస్తూ కొంత మంది కోర్టులకు వెళ్లారు.
పన్ను మినహాయింపు ఇస్తే.. టిక్కెట్ ధరలో ఎంత పన్ను పడుతుందో అంత వరకూ పన్ను మినహాయిపు ఇస్తారు. అయితే అసలు ఆ పన్ను జీఎస్టీనా.. కాదా అన్నదానిపై స్పష్టత లేదు. శాతకర్ణి సినిమా వచ్చే టప్పటికీ ఇంకా జీఎస్టీ అమలులో లేదు. కోర్టు విచారణలో ఏం జరుగుతుందో కానీ ఇక ముందు నుంచి పన్ను మినహాయిపులు ఏదైనా చిత్రానికి లభిస్తే ఆ మేరకు రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది.