బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి శుక్రవారం సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. 2002లో ముంబైలో బాంద్రా అనే ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుండి సల్మాన్ ఖాన్ కారు నడిపించడంతో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మరణించారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తప్ప త్రాగి కారు నడిపాడని ముంబై కోర్టు నిర్ధారించుకొని అతనికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. కానీ ముంబై హైకోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించి, జైలు శిక్షని రద్దు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ ఒక పిటిషన్ వేయగా దానిని ఈరోజు విచారణకు స్వీకరించిన కోర్టు సల్మాన్ ఖాన్ కి నోటీసు జారీ చేసింది. ఆరువారాలలోగా నోటీసుకు బదులివ్వవలసిందిగా ఆదేశించింది.
సల్మాన్ ఖాన్ తరపున ఈరోజు కోరుకి హాజరయిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ఈ కేసులో ఈ కేసులో ఒకే ఒక సాక్షి చెప్పిన సాక్ష్యం ఆధారంగా దిగివ కోర్టు సల్మాన్ ఖాన్ న్ని నేరస్తుడిగా నిర్ధారించి శిక్ష వేసిందని, అది తప్ప అతను దోషి అని నిరూపించే బలమయిన ఆధారాలు ఏవీ లేనందునే హైకోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించిందని వాదించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరయిన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ ఆయన వాదనను ఖండించారు. ఈ కేసులో గాయపడినవారు, ఇంకా అనేక మంది ఇతర సాక్షులు కూడా ఉన్నారని, వారిలో ఒక ప్రత్యక్ష సాక్షి సల్మాన్ ఖాన్ త్రాగి కారు నడిపినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని కనుక సల్మాన్ ఖాన్ నోర్దోషి అని చెప్పడం సరికాదని వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత జస్టిస్ట్ జగ్జిత్ సింగ్ ఖేర్, జస్టిస్ సి.నాగప్పన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం సల్మాన్ ఖాన్ కి నోటీసు జారీ చేస్తూ ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసింది. “ఈ అత్యున్నత న్యాయస్థానంలో అతను నిర్దోషిగా బయటపడగలిగితే దాని వలన అతనికి ఈ సమస్యలన్నిటి నుండి విముక్తి లభిస్తుంది,” అని అన్నారు.