రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశంపై సీబీఐ లేదా.. మరో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ లేదా మరో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ… రఘురామ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… కేంద్రం, సీబీఐలను ప్రతివాదులుగా గుర్తిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ప్రతివాదాలుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తోపాటు సీఐడీలను గుర్తించలేదు. రఘురామకృష్ణరాజు కుమారుడు దాఖలు చేసిన పిటిషన్లోనే ప్రతివాదులుగా వారిని తొలగించారు.
ఏపీ సర్కార్, సీఎం జగన్, సీఐడీలను ప్రతివాదులుగా తొలగించడంపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేసి.. వారిని కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరినా… ధర్మాసనం అంగీకరించలేదు. తమ రిస్క్ మీదే ప్రతివాదులను తొలగించామని.. రఘురామకృష్ణ కుమారుడు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. దీంతో 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు ఇచ్చింది. వాదనలు వినకుండా ఏ నిర్ణయమూ తీసుకోబోమని చెప్పిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.
ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐలను మాత్రమే చేర్చడంతో వారు సీబీఐ విచారణకు అనుకూలంగానే కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే.. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో రఘురామకృష్ణరాజు కాలికి గాయాలయ్యాయని నివేదిక వెల్లడించింది. ఎంపీపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అంశాన్ని కేంద్రం తేలికగా తీసుకునే అవకాశం లేదు. విచారణ చేస్తారా అంటే .. చేయలేమని చెప్పే పరిస్థితి సీబీఐకి లేదు. ఈ కారణంగా సీబీఐ విచారణ జరగడానికే ఎక్కువ అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.