హైదరాబాద్: ఢిల్లీ నిర్భయ అత్యాచార కేసులో దోషి అయిన బాలనేరస్థుడిని విడుదల చేయొద్దంటూ ఢిల్లీ మహిళా సంఘం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్ట్ కొట్టిపారేసింది. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చినపుడు బాలనేరస్థుడి విడుదలను ఆపటానికి అవకాశం ఉందేమోనని ధర్మాసనం చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ చట్టంలో ఆ అవకాశం లేకపోవటంతో చేతులెత్తేసింది. పిటిషన్ను కొట్టిపారేసింది. పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ కమిషన్ ఫర్ వుమన్ అధ్యక్షురాలు స్వాతి మలీవాల్ కోర్ట్ తీర్పు తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ, బాలనేరస్థుల విషయంలో ప్రభుత్వం చట్టాలను మార్చనంతవరకు కోర్టులు కూడా ఏమీ చేయలేవని వ్యాఖ్యానించారు.
మరోవైపు నిర్భయ(జ్యోతిసింగ్) తల్లి మీడియాతో మాట్లాడుతూ, బాలనేరస్థుల విషయంలో ప్రభుత్వం చట్టాలను మార్చటానికి ఇంకా ఎన్ని అత్యాచారాలు, హత్యలు జరగాలని ప్రశ్నించారు. అత్యాచారానికి పాల్పడిన బాలనేరస్థుడు స్వేఛ్ఛగా బయటికొచ్చాడని, నిరసన జరుపుతున్న తమను మాత్రం పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. బాలనేరస్థుడి విడుదలకు నిరసనగా నిన్న నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ ఇండియాగేట్ వద్ద చేసిన ఆందోళనలో పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. అయితే పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.