రాజకీయ నాయకులకు, న్యాయమూర్తులకు బెదిరింపు లేఖలు అందుకోవడం సర్వసాధారణ విషయమే అయినా, చివరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా బెదిరింపు లేఖలు రావడం చాలా ఆందోళన కలిగించే విషయమే. ముంబై ప్రేలుళ్ళ కేసులో యాకుబ్ మీమన్ని తెల్లవారితే ఉరి తీస్తారనగా, ఆరోజు తెల్లవారుజామున అతని తరపున న్యాయవాదులు జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అతనికి చట్ట ప్రకారం రెండు వారాల ముందుగా డెత్ వారెంట్ ఇవ్వలేదు కనుక అతని ఉరిశిక్షని నిలిపివేయమని కోరారు. కానీ న్యాయమూర్తి దీపక్ మిశ్ర వారి అభ్యర్ధనని తిరస్కరించడంతో నాగపూర్ సెంట్రల్ జైల్లో యాకుబ్ మీమన్ని ఉరితీయబడ్డాడు. కనుక గుర్తు తెలియని వ్యక్తులెవరో దీపక్ మిశ్రా ఇంటి గేటు ముందు ఒక బెదిరింపు లేఖని వదిలివెళ్ళారు. ఆయన భద్రతా సిబ్బంది డిల్లీలో తుగ్లక్ రోడ్డులో గల పోలీస్ స్టేషన్లో దీని గురించి పిర్యాదు చేసారు. ఆ లేఖను పోలీసులకి అందజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన డిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ముకేష్ కుమార్ మీనా దీనిపై దర్యాప్తు కోసం ఉగ్రవాద నిరోధ బృందాన్ని రంగంలో దింపారు. డిల్లీలోకి 9మంది పాక్ ఉగ్రవాదులు జోరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ఈ లేఖ వారే పంపారా? లేకపోతే స్థానికంగా వారికి మద్దతు ఇస్తున్న వారెవరయినా పంపారా? అనే విషయం కనిపెట్టేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు.